నిజమైన ప్రేమ కోసం అన్వేషణ.. రూ.4 కోట్లు పోగొట్టుకున్న మహిళ

నిజమైన ప్రేమ కోసం అన్వేషణ.. రూ.4 కోట్లు పోగొట్టుకున్న మహిళ

ప్రేమంటే రెండు అక్షరాలు కాదు..  రెండు హృదయాల కలయిక, రెండు ఆలోచనల కలయిక, రెండు ఆత్మల కలయిక.. ఇలా చెప్తుంటే ఎంత బాగుందో కదా..! ఇది ఒకప్పటి ప్రేమాయణం. ఆ జ్ఞాపకాలు కవిత్వాల  రూపంలో ఇప్పుడు పుస్తకాలకు పరిమితమైపోయాయి. ఇప్పుడంతా కామం. ప్రేమ పేరుతో దగ్గరయ్యామా, కోరిక తీర్చుకున్నామా.. చివరగా మరొకరి మెడలో మూడు ముళ్లు వేశామా..! నమ్మినా, నమ్మకున్నా ఇప్పటి సమాజంలో జరుగుతోన్న తంతు ఇదే. ఇది తెలియని ఓ మహిళ నిజమైన ప్రేమ కోసం అన్వేషణ సాగించి.. 4 కోట్ల రూపాయలు సమర్పించుకుంది. 

అసలేం జరిగిందంటే..?

ఆస్ట్రేలియాకు చెందిన అన్నెట్ ఫోర్డ్ అనే మహిళ 2018లో 33 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికి ఆన్‌లైన్ డేటింగ్ వైపు మొగ్గు చూపింది. ఇతరుల చేతుల్లో మోసపోయి లేదా నిజమైన ప్రేమ కోసం వెతికే వారు డేటింగ్ యాప్‌లలో ఉంటారనేది అప్పట్లో ఆమె అభిప్రాయం. అలా డేటింగ్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసిందో లేదో.. ఒకడు తగిలాడు. పేరు.. విలియం. చాలా సున్నితంగా మాట్లాడుతూ.. అప్పుడప్పుడు నవ్వించే జోకులేస్తూ ఆమెను పడేశాడు. అంతే.. అన్నెట్ అతగాడికి ముగ్ధురాలై పోయింది. గంటల తరబడి అతనితో చాట్ చేసేది. 

తనను బాగా నమ్మిన తరువాత విలియం అసలు పని మొదలు పెట్టాడు. ఆర్థిక కష్టాల్లో ఉన్నానని చెప్పి మొదట 5వేల డాలర్లు(రూ. 2.75 లక్షలు) వేపించుకున్నాడు. అలాగే రోజుకొక కథ చెప్తూ నెలరోజుల వ్యవధిలోనే రూ. 1.6 కోట్లు స్వాహా చేశాడు. అంతటితో అతని అత్యాశ తీరలేదు. పదే పదే డబ్బులు అడగ సాగాడు. అతనితో విసిగిపోయిన అన్నెట్.. మోసపాయానని గ్రహించి డేటింగ్ యాప్ వ్యవహారాలను పక్కన పెట్టింది. పోయిన డబ్బులు తిరిగి ఇప్పించమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో అన్నెట్ మరోదారి మొదలుపెట్టింది.

నాలుగేళ్ల తరువాత ఫేస్‌బుక్‌.. 

నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న అన్నెట్.. ఈసారి పోయిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలనే దానిపై ఫేస్‌బుక్‌‌లో అన్వేషణ మొదలు పెట్టింది. ఈసారి ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందినవాడినని చెప్పుకున్న 'నెల్సన్' అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇతగాడు తనకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)లో ఒక స్నేహితుడు ఉన్నాడని.. ఆమె పెట్టిన కేసుపై విచారణ త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి తాను సహాయం చేస్తానని నమ్మబలికాడు. దానికోసం 2500 డాలర్లు ఇవ్వాలని అడిగాడు. అందుకు మొదట నిరాకరించిన అన్నెట్‌.. చివరకు అతడు అడిగినంత ముట్టజెప్పింది. అలా పేమెంట్‌ చేసిన కొద్దిసేపట్లోనే ఆమె ఖాతాలో ఉన్న డబ్బులన్నీ పోయాయి.

సర్వం పోయాక.. అన్నెట్ నిద్ర మేల్కొంది. తనలా ఎవరూ మోసపోకండని అందరినీ హెచ్చరించింది. నిజమైన ప్రేమ అనేది సృష్టిలో దొరకదని తనలా ఎవరూ మరొకరికి బాలి కావొద్దని ఉపదేశమిచ్చింది.