ఆసీస్ ఆటగాళ్లు ఛీటర్స్..వీడియో వైరల్

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో ఔటైన తీరుపై వివాదం చోటు చేసుకుంది.  క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఆస్ట్రేలియా జట్టు వ్యవహరించిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను మేరిల్ బోన్ క్రికెట్ క్లబ్ సభ్యులు, అభిమానులు ఘోరంగా దూషించారు. ఛీటర్స్ అంటూ ఎగతాళి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఛీటర్స్..ఛీటర్స్.. 

రెండో టెస్టు చివరి రోజు లంచ్ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెసింగ్ రూంలోకి వస్తున్నారు. అప్పటికే జానీ బెయిర్ స్టోను ఆసీస్ ఔట్ చేసింది.  ఈ సమయంలో ఆటగాళ్లను లార్డ్స్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు దూషించారు. ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ లతో పాటు..ఇతర ఆటగాళ్లు ఛీటర్స్..ఛీటర్స్ అంటూ అరవడం మొదలు పెట్టారు. ఓ అభిమాని బాల్ టాంపరింగ్ వివాదం గురించి ప్రస్తావిస్తూ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లను హేళన చేశాడు.  

సభ్యుల సస్పెండ్..

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్..ఆస్ట్రేలియా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సభ్యులను సస్పెండ్ చేసింది. భవిష్యత్తులో వారు లార్డ్స్  క్రికెట్ గ్రౌండ్ లోకి రాకుండా నిషేధించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటనను విడుదల చేసింది. ఎంసీసీ సభ్యుల ప్రవర్తనకు చింతిస్తున్నాం...ఆటగాళ్లను దూషించిన సభ్యులు  మళ్లీ లార్డ్స్‌లో అడుగుపెట్టరు. వారిపై  నిషేధం విధిస్తున్నాం... ఓ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు...అని ఎంసీసీ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ గై లావెండర్ తెలిపాడు.

అసలేం జరిగిందంటే...?

యాషెష్ 2023 రెండో టెస్టు చివరి రోజు ఫస్ట్ సెషన్‌లో ఇంగ్లండ్‌ 193/5 స్కోరుతో ఆడుతోంది. అయితే ఈ  సమయంలో  కామెరూన్ గ్రీన్‌ బౌన్సర్‌ వేశాడు. ఆ బౌన్సర్ ను  తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బాల్ బెయిర్ స్టో వీపు పై నుంచి  వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి పడింది. ఈ సమయంలో  నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్‌ను కలిసేందుకు  బెయిర్ స్టో క్రీజు నుంచి బయటకు వచ్చాడు. వెంటనే కారీ తన చేతుల్లోని  బంతిని వికెట్లకు కొట్టి అప్పీల్ చేశాడు. ఆసీస్ ఆటగాళ్లు సైతం అప్పీల్ చేశారు.  బెయిర్‌స్టో, స్టోక్స్‌తో పాటు ఇంగ్లండ్‌ క్రికెటర్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

ALSO READ:మనీష్ సిసోడియాకు షాక్.. మళ్లీ బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

అన్యూహ నిర్ణయం..వివాదాస్పదం..

అయితే బెయిర్‌స్టో రన్ కోసం  ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్‌  నాటౌట్‌ గా ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు.  కానీ బంతి డెడ్‌ కాలేదని భావించి థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాలు చేసుకుంది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు షాకయ్యారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధమంటూ ఆస్ట్రేలియాపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు.