ఆఫ్ఘనిస్తాన్ మీద ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే వార్ వన్ సైడ్ అని అందరూ ఫిక్సయిపోతారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లలో ఒకటైన కంగారూల జట్టు ఐసీసీ టోర్నీల్లో మరో కోణాన్ని చూపిస్తారు. పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. వరల్డ్ కప్ అంటే కసిగా ఆడే ఆస్ట్రేలియా అందుకు తగ్గట్టుగానే టోర్నీలో ఓటమి లేకుండా దూసుకుపోయింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో గెలిచిన కంగారూల జట్టు మరోసారి టీ20 వరల్డ్ కప్ కొట్టేలా కనిపించింది.
సూపర్ 8 లో భాగంగా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచి తర్వాత సెమీస్ కు ఈజీగానే చేరుతుందని భావించారు. మరో రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీ ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా నిన్నటివరకు వినిపిస్తున్న మాటలు. అయితే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం (జూన్ 23) ఉదయం జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా అనూహ్యంగా ఓడిపోయింది. దీంతో ఇప్పుడు ఆసీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటని పరిశీలిస్తే మిచెల్ స్టార్క్ లేకపోవడమే అని స్పష్టంగా తెలుస్తుంది.
టాస్ తర్వాత తుది జట్టులో స్టార్క్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఆస్ట్రేలియా పవర్ ప్లే లో వికెట్ రాబట్టుకోలేకపోయింది. 118 పరుగుల వరకు వికెట్ తీయలేకపోయింది. కొత్త బంతితో అద్భుతాలు చేసే స్టార్క్ ను తుది జట్టులో లేకపోవడం ఆసీస్ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ యార్కర్ల వీరుడు లేకపోవడానికి కారణం ఏంటో తెలియలేదు. పిచ్ స్పిన్ కు అనూలిస్తుందని స్పిన్నర్ ఆష్టన్ అగర్ ను ప్లేయింగ్ 11 లో చోటిచ్చినా స్టార్క్ లాంటి మ్యాచ్ విన్నర్ ను బెంచ్ పై కూర్చోబెట్టడం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్స్ తీసిన స్టార్క్ సూపర్ 8 లో కీలక మ్యాచ్ లో అందించకపోవడమే వారి పరాజయానికి కారణమైంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్టుపై స్టార్క్ అవసరం లేదనుకున్నారేమో. అతన్ని సెమీస్ కు సిద్ధం చేయాలనే ఆలోచనలో రెస్ట్ ఇచ్చారేమో. అదే జరిగితే ఆసీస్ అతి విశ్వాసం వారి కొంప ముంచిందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు 148 పరుగులు చేసింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను అఫ్గాన్ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆలౌట్ చేశారు.