
శ్రీలంకతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. శ్రీలంకతో వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు శ్రీలంకతో రెండు వన్డేలకు ఆదివారం (ఫిబ్రవరి 9) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టులో కెప్టెన్ గా ఎవరినీ ఎంపిక చేయలేదు. బుధవారం (ఫిబ్రవరి 12) తొలి వన్డే.. ఫిబ్రవరి 14 రెండో వన్డే జరగనుంది. స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ లలో ఒకరు కెప్టెన్ గా చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా శ్రీలంక సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.
ఈ వన్డే సిరీస్ కోసం ఫాస్ట్ బౌలర్లు బెన్ డ్వార్షుయిస్, స్పెన్సర్ జాన్సన్ లాంటి యువ ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి చేరారు. బ్యాటింగ్ లో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌కు అవకాశం దక్కింది. లెగ్-స్పిన్నర్ తన్వీర్ సంఘా స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మెగా టోర్నీలో నలుగురైదుగురు స్టార్ ఆటగాళ్ల సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా కోల్పోనుంది. స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటించడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ.
పేసర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హాజెల్‌వుడ్ గాయాల నుంచి కోలుకోలేదని.. వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉండరని క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించింది. భారత్‌తో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ముగింపులో ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ చీలమండ నొప్పి బారిన పడగా.. పిక్క నొప్పి నుండి హేజిల్‌వుడ్ ఇంకా కోలుకోలేదు. కమ్మిన్స్(చీలమండ గాయం), జోష్ హాజిల్‌వుడ్(పిక్క నొప్పి), మిచెల్ మార్ష్(వెన్ను నొప్పి) లకు గాయాలు కాగా.. మార్కస్ స్టోయినిస్(రిటైర్మెంట్). మ్యాచ్ విన్నర్లైన ఈ నలుగురు దూరమవ్వడం ఆస్ట్రేలియా జట్టుకు భారీ దెబ్బ అని చెప్పుకోవాలి.
శ్రీలంక వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు:
ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ , అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీ, గ్లెన్ మాక్స్వెల్ , కూపర్ కొన్నోలీ, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మిచెల్ స్టార్క్ , నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘ.