మూసీలో సగం ఆక్రమణలే!

  • పరీవాహకం 110 చ.కి.మీ.. ఆక్రమణలు 50 చ.కి.మీ.
  • అక్రమ నిర్మాణాల తొలగింపే పెద్ద సమస్య 
  • ఆ బాధ్యతలు హైడ్రాకు అప్పగించే యోచన!


హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన అంత ఈజీగా కన్పించడం లేదు. నది పొడవునా పెద్ద సంఖ్యలో ఆక్రమణలు ఉండడంతో వాటిని ఎలా తొలగించాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మూసీ రివర్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్టుపై అధికారులు ఇప్పటికే కొంత మేర కసరత్తు చేశారు. మూసీ సరిహద్దులు, ఆక్రమణలపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

జీఐఎస్​ మ్యాపింగ్​ కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. మూసీ పరీవాహక ప్రాంతం 110 చ. కిలోమీటర్లు అయితే ఇందులో 50 చ. కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణలే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మూసీ  పొడవు 56 కిలోమీటర్ల కాగా అందులో రెండు వేల వరకు కబ్జాలు ఉన్నాయని, మరో 10 వేల వరకు పట్టాలు కలిగిన వారు నిర్మాణాలు చేపట్టినట్టు తేలింది.

కొందరు పట్టాలో ఉన్నదానికంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టినట్టు అధికారుల సర్వేలో తేలింది. ఈ ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగిస్తేనే పనులు వేగవంతం అవుతాయని అధికారులు అంటున్నారు.  

మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మూసీ పరీవాహకంలో ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించాలంటే అందుకు తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా నోటీసులిచ్చి నిర్వాసితులను గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. అర్హులైన వారికి నష్టపరిహారం ఇవ్వడంతోపాటు పట్టాలు ఉన్న వారి కోసం టీడీఆర్​ అమలు, ల్యాండ్​పూలింగ్​ స్కీమ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.