- సర్కారు నుంచి ఫండ్స్ రాక.. స్టూడెంట్లపై ఫీజుల మోత
- రూ.65.62 కోట్లు రాబట్టేందుకు కాకతీయ వర్సిటీ రెడీ
- రెండేండ్లలో ఏడెనిమిది రెట్లు పెరిగిన కోర్సుల ఫీజులు
- నాన్ సెమిస్టర్ బ్యాక్ లాగ్ సబ్జెక్టుకు రూ. 4 వేలు,
- ఇయర్ కు రూ. 3 వేల ప్రాసెసింగ్ చార్జీ
- ఫీజుల దోపిడీపై మండిపడుతున్న స్టూడెంట్లు
- ఆందోళనకు దిగిన కాకతీయ డిగ్రీ కాలేజీ విద్యార్థులు
- శాతవాహన, పాలమూరు వర్సిటీలదీ ఇదే పరిస్థితి
హనుమకొండ/ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కారు ఫండ్స్ ఇయ్యకుండా గాలికి వదిలేయడంతో యూనివర్సిటీలను నడిపేందుకు అధికారులు పేద విద్యార్థులపై భారం మోపుతున్నారు. రెండేండ్ల కిందటితో పోలిస్తే కోర్సులు, పరీక్షల ఫీజులను ఏడెనిమిది రెట్లు పెంచేశారు. కాకతీయ యూనివర్సిటీలో తాజాగా నాన్ సెమిస్టర్ బ్యాక్ లాగ్ సబ్జెక్టుకు రూ. 4 వేలు, ఇయర్ కు రూ. 3 వేల చొప్పున ప్రాసెసింగ్ చార్జీ వసూలు చేయడంపై స్టూడెంట్లు, స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నాయి. కాకతీయ వర్సిటీ ఈ ఏడాది విద్యార్థుల ట్యూషన్, పరీక్షల ఫీజుల ద్వారానే ఏకంగా రూ.65 కోట్లకుపైగా నిధులు గుంజేందుకు రెడీ అయింది.
మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తీసుకునే టైంలో కట్టాల్సిన ఫీజులను కూడా ఇప్పుడే గుంజుతున్నది. దీంతో ఆగ్రహించిన హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ స్టూడెంట్లు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆరో సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు రూ.650 కాగా రూ.500 అదనంగా వసూలు చేస్తున్నారని, నిరుపేద విద్యార్థులపై అడిషనల్ చార్జీలు బాదడం ఏమిటని ఫైర్ అయ్యారు. మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ల కోసం కూడా అదనంగా వసూలు చేస్తున్నారని, ఇదేమని అడిగితే ప్రిన్సిపాల్ స్పందించడంలేదన్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలని లేదంటే ప్రిన్సిపాల్ తో పాటు వర్సిటీ వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏడు రెట్లకు పైగా పెరిగిన ఫీజులు
కాకతీయ వర్సిటీ పరిధిలో ట్యూషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులను విపరీతంగా పెంచేశారు. ఒక్కో కోర్సు ఫీజును ఎడెనిమిది రెట్లు పెంచారు. గతంలో ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, ఎకనామిక్స్, సోషియాలజీ తదితర కోర్సుల ఫీజులు రూ.2,410 ఉంటే వాటిని రూ.14 వేలు చేశారు. ఎమ్మెస్సీ గ్రూపుల ఫీజులను రూ.3,010 నుంచి రూ.21 వేలకు పెంచారు. ఎంబీఏ రూ.7,420 నుంచి రూ.35 వేలు, ఎల్ఎల్బీ రూ.7,420 నుంచి రూ.16 వేలు, ఎల్ఎల్ఎం రూ.8,220 నుంచి రూ.23 వేలు, ఎంహెచ్ఆర్ఎం ఫీజును రూ.3,410 నుంచి రూ.20 వేలకు పెంచేశారు. దీంతో వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
సర్కారు సగం కూడా ఇయ్యట్లే
వర్సిటీలకు ప్రభుత్వం ఏటా నామమాత్రపు బడ్జెట్ కేటాయించడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. కాకతీయ వర్సిటీ నుంచి ఆఫీసర్లు ఏటా రూ.300 కోట్లకు తగ్గకుండా ప్రతిపాదనలు పంపిస్తుంటే.. ప్రభుత్వం అందులో సగం కూడా కేటాయించడం లేదు. ఈ ఏడాది దాదాపు రూ.350 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.127.55 కోట్లు మాత్రమే కేటాయించింది. వర్సిటీ నిర్వహణకు కూడా డబ్బులు చాలక చివరకు విద్యార్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. కేయూ అధికారులు ఈ సారి రూ.389.53 కోట్లతో బడ్జెట్ పెట్టగా.. ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ రూపంలో రూ.127.55 కోట్లు, యూజీసీ ఏరియర్స్ రూ.32.81 కోట్లు, పరీక్షల విభాగం, అకడమిక్ ఫీజులు రూ.65.62 కోట్లుగా ఆదాయ అంచనా వేసింది. అంటే వర్సిటీలో ఫీజుల ద్వారానే రూ.65.62 కోట్లు సమకూరుతుండగా.. ఆ భారమంతా స్టూడెంట్లపైనే పడుతోంది. రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
బ్యాక్ లాగ్లకు వేలల్లో ఫీజులు
గతంలో డిగ్రీలో ఒకటి లేదా రెండు సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉంటే రూ.550, అంతకు మించి ఉంటే రూ. 600 పరీక్ష ఫీజు ఉండేది. కానీ ఈ ఏడాది కొత్తగా ఒక్కో సబ్జెక్టుకు రూ.4 వేలు, ప్రాసెసింగ్ ఫీజు రూ. 3 వేల చొప్పున నిర్ణయించారు. ఈ లెక్కన ఒక్కో సబ్జెక్టుకు రూ.7 వేల వరకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల్లో ఒక్కో సబ్జెక్టు ఫెయిలై ఉంటే ప్రాసెసింగ్ ఫీజు కింద మొత్తం రూ. 9 వేలతో పాటు పరీక్ష ఫీజు కింద రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక్కొక్క సంవత్సరంలో ఒకే సబ్జెక్టు ఉంటేనే రూ.21 వేలు దాటితే.. ఎక్కువ సబ్జెక్టులు ఉన్న స్టూడెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇయర్ వైజ్ పరీక్ష ఫీజులకు సంబంధించి కాకతీయ వర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ మల్లారెడ్డిని ‘వెలుగు’ ప్రతినిధి ఫోన్ ద్వారా ప్రశ్నించగా.. గతంలోనే ఇయర్ వైజ్ అవకాశం ఇవ్వొద్దని అనుకున్నామని, ఈ సారి చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. తనను ఇలా ఫోన్లో కాంటాక్ట్ చేయొద్దని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోమన్నారు.
కాకతీయ బాటలోనే మిగతా వర్సిటీలు
శాతవాహన వర్సిటీ నిర్వహణకు ఏటా రూ.40 కోట్ల వరకు అవసరం ఉండగా.. ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.13.70 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలకే సరిపోతున్నాయి. వర్సిటీ నిర్వహణ భారంగా మారడంతో ఫీజుల వసూళ్లతో నెట్టుకొస్తున్నారు. 2021–22లోనే కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ట్యూషన్ ఫీజులను రూ.3 వేల నుంచి15 వేలకు పెంచారు. ఈ ఏడాది ఎగ్జామ్ ఫీజు, సర్టిఫికెట్ల జారీ ఫీజులను రూ.50 నుంచి రూ.500 వరకు పెంచారు.
పాలమూరు వర్సిటీకి మూడేళ్లుగా ప్రభుత్వం సరిపడా ఫండ్స్ కేటాయించడం లేదు. 2019–-20లో డెవలప్మెంట్ కోసం రూ.90 లక్షలే కేటాయించింది. అప్పటి నుంచి శాలరీలకే బడ్జెట్ కేటాయిస్తోంది. వర్సిటీలో జీతాలకు రూ.14 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా, 2021–-22లో రూ.7.50 కోట్లు, 2022-–23లో రూ.9.85 కోట్లు మంజూరు చేసింది. 2023-–24 బడ్జెట్లో రూ.84 కోట్లతో ఎస్టిమేషన్లు పంపగా, రూ.10.91 కోట్లే కేటాయించింది. ఈ ఫండ్స్ సరిపోకపోవడంతో వర్సిటీ సిబ్బంది ఎగ్జామ్ ఫీజులు, స్పోర్ట్స్ కోటా కింద స్టూడెంట్ల నుంచి తీసుకునే ఫీజుల నుంచి జీతాలకు అడ్జెస్ట్ చేస్తున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి వర్సిటీ పరిధిలోని కాలేజీల ఫీజులూ పెంచనున్నారు.
ఫీజులను తగ్గించాలి
డిగ్రీ సెకండ్ ఇయర్ లో నాకు ఒక సబ్జెక్టు బ్యాక్ లాగ్ ఉంది. పొలం పనులు చేసుకుంటూ పరీక్షలు రాస్తున్నా. డిగ్రీ కంప్లీట్ చేస్తేనే కొన్ని రుణాలకు అర్హత ఉంటుంది. ఇదే లాస్ట్ చాన్స్ అంటే తీవ్రంగా నష్టపోతాం. ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసి, పెంచిన ఫీజులను కూడా తగ్గించాలి.
- జంగిటి చంద్రశేఖర్, డిగ్రీ విద్యార్థి, బజార్ హత్నూర్