
- ఇప్పటికే తేలిన ఓటర్ల లెక్క
- రిటర్నింగ్ ఆఫీసర్ల శిక్షణకు ఏర్పాట్లు
మెదక్ /సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీటీసీ స్థానాల ఖరారు పూర్తి కాగా ఈ నెల10న ఓటర్ల జాబితా, 11న పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం పూర్తి కాగా వారి శిక్షణకు ఏర్పాట్లు చేశారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఈ మేరకు 21 జడ్పీటీసీ, 21 ఎంపీపీ స్థానాలతో పాటు మొత్తం 190 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అత్యధికంగా పాపన్నపేట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత హవేలీ ఘనపూర్, చిన్నశంకరం పేట, పెద్ద శంకరంపేట, చేగుంట, శివ్వంపేట మండలాల్లో 12 చొప్పున, కౌడిపల్లి, కొల్చారం, టేక్మా ల్, నర్సాపూర్ మండలాల్లో 10 చొప్పున, వెల్దుర్తి, అల్లాదుర్గం మండలాల్లో 9 చొప్పున, నిజాంపేట్ మండలంలో 8, రామాయంపేట, రేగోడ్, మనోహరాబాద్, మెదక్ మండలాల్లో 7 చొప్పున, చిలప్ చెడ్ మండలంలో 6, నార్సింగి, తూప్రాన్, మాసాయిపేట మండలాల్లో 5 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 1,052 పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,23,966 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళలు 2,71,878 మంది, పురుషులు 2,52,079 మంది, థర్డ్ జెండర్లు 9 మంది ఉన్నారు. ఈ మేరకు ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణ కోసం 91 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను, 91 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 జడ్పీటీసీలు, 276 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019 స్థానిక సంస్థల ఎన్నికల టైంలో 295 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు 276కు తగ్గాయి. ఈసారి 11 గ్రామ పంచాయతీలను అప్ గ్రేడ్ చేస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన 4 మున్సిపాలిటీలలో వాటిని కలపడం వల్ల 19 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. హత్నూర మండలంలో అత్యధికంగా 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆ తర్వాత నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల్లో 15 ఎంపీటీసీలు ఉన్నాయి. అతి తక్కువగా అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో ఐదేసి ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 27 మండలాల వారీగా మొత్తం 8,51,420 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో పురుషులు 4,23,062 మంది, మహిళ ఓటర్లు 4,27,739 మంది, ఇతరులు 52 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పురుషుల కన్నా మహిళ ఓటర్లు 4,677 మంది ఎక్కువగా ఉన్నారు. ఎంపీటీసీ స్థానాల ఖరారు పూర్తి కాగా సోమవారం ఓటర్ల జాబితా, మంగళవారం పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రదర్శించారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ఏఆర్ వోల నియామకం పూర్తికాగా స్టేజ్-1, 2 స్థాయిలో కలెక్టర్ సమక్షంలో ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేశారు.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో మొత్తం 230 ఎంపీటీసీ, 26 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 లో మొత్తం 23 మండలాలుండగా కొత్తగా ధూల్మిట్ట, కుకునూరుపల్లి, అక్బర్ పేట, భూంపల్లి మండలాలు ఏర్పడడంతో వాటి సంఖ్య 26కు చేరింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ ఎంపీటీసీ స్థానాలు రద్దు కాగా కొత్తగా మోతే, కమ్మర్ పల్లి, అర్జునపట్ల ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు కావడంతో వాటి సంఖ్య 230 కి చేరింది. 11,867 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్నారు. ఇప్పటికే వారికి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 26 మండలాల పరిధిలో మెత్తం 6.50 లక్షల ఓటర్లుండగా వీరిలో పురుషులు 3,03,141, మహిళలు 3,12,861 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే జిల్లాలో అధికంగా ఉండడం విశేషం.