చాయ్​ నుంచి బిర్యానీ దాకా కల్తీనే.. ఆహార కల్తీపై శిక్షలేవీ..?

చాయ్​ నుంచి బిర్యానీ దాకా కల్తీనే.. ఆహార కల్తీపై శిక్షలేవీ..?
  • నోటీసులతోనే సరి కనీసం లైసెన్స్‌‌‌‌లు కూడా రద్దు చేస్తలే
  • చట్ట ప్రకారం రూ.లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం
  • గత రెండేండ్లలో 3 వేల మందికి పైగా నోటీసులు.. కానీ ఒక్కరికీ జైలు శిక్ష పడలే
  • హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు 
  • నామమాత్రపు పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు 
  • రాష్ట్రం మొత్తానికి ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్.. సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లూ లేరు 
  • ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా.. చాయ్​ నుంచి బిర్యానీ దాకా కల్తీనే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడడం లేదు. అధికారులు తనిఖీలు చేయడం, ఆపై నోటీసులు ఇవ్వడం తప్ప.. కల్తీరాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కల్తీ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. పాలు, టీపౌడర్ మొదలుకుని నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్నీ కల్తీ చేస్తున్నారు. హోటల్, రెస్టారెంట్లలో కుళ్లిన చికెన్, మటన్‌‌తో బిర్యానీలు వడ్డిస్తున్నారు. ఆ వంటకాల్లో పురుగులు, ఈగలు, బొద్దింకలు, బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి, అక్కడి అధ్వాన పరిస్థితులపై ఫొటోలు, వీడియోలు రిలీజ్​చేయడం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడమూ పరిపాటిగా మారింది. 

ఆహార కల్తీకి పాల్పడుతూ రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుబడ్తున్నోళ్లపైనా ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతో, మహా అయితే నామమాత్రపు పెనాల్టీ వేయడంతోనే సరిపెడ్తున్నారు. గత రెండేండ్లలో 3 వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినా, వారిలో ఒక్కరంటే  ఒక్కరు కూడా జైలుకెళ్లలేదు. కనీసం ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల లైసెన్సులు కూడా రద్దు చేయడం లేదు. దీంతో ఫుడ్​సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీరాయుళ్లు అదరక బెదరక తమ దందా కొనసాగిస్తున్నారు. 


రాష్ట్రంలో ఆహార కల్తీ అంతకంతకు పెరుగుతోంది. 2021 నుంచి 2024 సెప్టెంబర్ వరకు పరీక్షించిన 15,702 శాంపిల్స్‌‌లో 2,387 (15 శాతం)  శాంపిల్స్‌‌లో కల్తీ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌‌లో వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు (22.59%) తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వం ప్రతి ఏటా శాంపిల్ టెస్టుల లక్ష్యాన్ని పెంచుతున్నా, కల్తీ శాతం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. రాష్ట్రంలో 2022-–23లో 4,809 శాంపిల్స్ టెస్టు చేస్తే 18.59 శాతం , 2023-–24లో 6,156 శాంపిల్స్ టెస్టు చేస్తే 15.81 శాతం కల్తీ అయినట్లు తేల్చారు. ఇక 2024–25లో గత సెప్టెంబర్ వరకు1,600  శాంపిల్స్​ టెస్టు చేస్తే.. 11 శాతం  కల్తీ అయినట్లు తేలింది. ఇందులో రిజల్ట్స్​వచ్చిన కొన్ని శాంపిల్స్​మాత్రమే ఉన్నాయి.  

పూర్తి స్థాయిలో శాంపిల్స్​రిజల్ట్స్​ వస్తే ఇది మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చేసే శాంపిల్స్‌‌తో పాటు కొన్నిసార్లు కంప్లయింట్స్ ఆధారంగా చేసిన శాంపిల్ టెస్టుల ఫలితాలే ఇలా ఉన్నాయంటే.. క్షేత్రస్థాయిలో ప్రతి హోటల్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్,  మసాలాలు, పాలు ఇతర ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను తనిఖీ చేసి శాంపిల్స్ తీస్తే పరిస్థితి మరింత భయానకంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కొన్ని నెలల కింద  ఖైరతాబాద్‌‌లో మోమోస్ తిని దాదాపు 90 మంది అస్వస్థతకు గురై, ఒక మహిళ కూడా చనిపోయింది. ఇలాంటి ఘటనలు  జరిగినప్పుడు రెండుమూడు రోజులు తనిఖీలు నిర్వహించి హడావుడి చేసే ఆఫీసర్లు.. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. 

ఒక్కరికి  కూడా జైలు శిక్ష పడలే..

ఆహార కల్తీకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద కఠిన శిక్షలు ఉన్నాయి. క్రిమినల్​ కేసులతో పాటు భారీ జరిమానాలు కూడా విధించవచ్చు. నాసిరకం(సబ్ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌) అని తేలితే జాయింట్, అడిషనల్ కలెక్టర్ వద్ద నేరస్తుడిని ప్రవేశపెట్టి రూ.5 లక్షలు జరిమానా గానీ, 6 నెలల జైలు శిక్ష గానీ, రెండు గానీ విధించే అవకాశం ఉంది.   కానీ కొంతమంది అధికారులు జైలు శిక్ష కాకుండా వేలల్లో పెనాల్టీ వేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కల్తీకి పాల్పడిన కేసుల్లో పట్టుబడిన వారు సైతం  రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల లోపు జరిమానా కట్టి బయటపడుతున్నారు.

 కల్తీ ఫుడ్​తిన్న వ్యక్తులు అస్వస్థతకు గురైతే, బాధ్యుడికి 6 నెలల నుంచి ఏడేండ్ల  వరకు జైలు శిక్షను విధించొచ్చు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి మరణిస్తే, కల్తీకి పాల్పడిన వ్యక్తికి 10 ఏండ్లు, లేదా జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు రాష్ట్రంలో జైలు శిక్షలు పడినోళ్లు.. భారీ జరిమానాలు చెల్లించినోళ్లు ఒక్కరూ కూడా లేరు. గత ఏడాది షాదాబ్, పిస్తా హౌస్, రామేశ్వరం కేఫ్, ఎమరాల్డ్ వంటి  పేరున్న  రెస్టారెంట్లలో సైతం పరిశుభ్రత పాటించకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడడంతో నోటీసులు జారీ అయ్యాయి. 

లక్డీకాపూల్‌‌లోని రాయలసీమ రుచులు, షా గౌస్ వంటి రెస్టారెంట్లలో తనిఖీల సమయంలో కల్తీ, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, అన్​సేఫ్టీ ప్రిజర్వేటివ్స్​గుర్తించారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లకు కేవలం నోటీసులు జారీ చేశారు. కొన్నింటిపై కేసులు నమోదు చేయగా ట్రయల్స్​కొనసాగుతున్నాయి. కనీసం ఆ హోటళ్లు, రెస్టారెంట్లను కూడా సీజ్​చేయలేదు. సాంకేతిక ఆధారాలు నిరూపించలేకపోవడం వల్లే చాలా కేసులు నీరుగారుతున్నాయని, అధికారుల ఉదాసీనత వల్లే బాధ్యులకు శిక్షలు పడడం  లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

అధికారులు, టెక్నీషియన్ల కొరత

రాష్ట్రంలో మొత్తం 80 ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్​(ఎఫ్‌‌ఎస్‌‌వో)  పోస్టులుండగా అందులో 20కి పైగా ఖాళీగా ఉన్నాయి. కేరళలో 160 ఎఫ్‌‌ఎస్‌‌వో పోస్టులతో పోలిస్తే తెలంగాణలో సగం మంది కూడా లేరు. నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్. జీహెచ్ఎంసీతో సహా 33 జిల్లాల నుంచి వచ్చే శాంపిల్స్‌‌ను ఇక్కడే టెస్టు చేస్తారు. 102 మంది టెక్నీషియన్లకు గాను, ప్రస్తుతం 30 నుంచి 40 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ల్యాబ్‌‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ల్యాబ్ లో సిబ్బంది కొరత వల్ల శాంపిల్ టెస్టింగ్‌‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్దంగా15- నుంచి 20 రోజుల సమయం పడుతోంది, ప్రస్తుతం ల్యాబ్‌‌లో నెలకు సగటున 600 శాంపిల్స్‌‌ను పరీక్షిస్తున్నారు. 

పెరుగుతున్న ఫుడ్ సెంటర్లు, శాంపిల్స్ సేకరణకు ఈ ల్యాబ్ సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో శాంపిల్స్ రిజల్ట్ కోసమే రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాల్లో ముగ్గురు చొప్పున  ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 90వేల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు ఉండగా.. ప్రస్తుతం 30  మంది ఫుడ్ ఇన్స్​పెక్టర్లు మాత్రమే ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే ఆహార వ్యాపారంలో 60 శాతానికిపైగా హైదరాబాద్‌‌లోనే కేంద్రీకృతమైంది. దీంతో  కల్తీ కూడా ఇక్కడే ఎక్కువ ఉంది. 

కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు కొనసాగడం లేదు.  కాగా, ఫుడ్​కల్తీపై త్వరలోనే మినీ ల్యాబ్‌‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం  సన్నాహాలు చేస్తోంది. ఈ ల్యాబ్‌‌లతో శాంపిల్ టెస్టింగ్ వేగవంతం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని 6 జోన్లలో ఒక్కో మినీ ఫుడ్‌‌ ల్యాబ్‌‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అధికారుల కొరత, ల్యాబ్‌‌లలో సమస్యలు పరిష్కారం కాకపోతే కల్తీకి చెక్ పెట్టడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి.. 

ఫుడ్ సేఫ్టీ చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కల్తీకి పాల్పడిన వారికి నోటీసులు, పెనాల్టీలు కాకుండా కఠిన శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా సరిపడా లేరు. దాదాపు 50 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాల్సిన గ్రేటర్ హైదరాబాద్ లో 30 మంది కూడా లేరు. దీంతో తనీఖీలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. జిల్లాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను పటిష్టం చేయాలి. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ పెంచాలి. ప్రభుత్వం ప్రకటించిన 3 ల్యాబ్‌‌లను వెంటనే ఏర్పాటు చేయాలి.           
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్