నల్లమలలో పర్యాటకానికి మహర్దశ .. టెంపుల్, ఎకో, రివర్ టూరిజానికి ప్రయారిటీ

నల్లమలలో పర్యాటకానికి మహర్దశ .. టెంపుల్, ఎకో, రివర్  టూరిజానికి ప్రయారిటీ

అటవీ, నదీ తీర ప్రాంతాల అభివృద్ధికి రూ.65 కోట్లతో ప్రపోజల్స్
సోమశిలకు అత్యధికంగా నిధులు

నాగర్​కర్నూల్, వెలుగు:  నల్లమల అటవీప్రాంతం, కృష్ణా తీరంలోని ప్రదేశాల డెవలప్​మెంట్​కు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన టూరిజం పాలసీలో టెంపుల్, ఎకో, రివర్  టూరిజం డెవలప్​మెంట్​కు నల్లమల అటవీ, కృష్ణా నది పరివాహక ప్రాంతం అనుకూలంగా ఉంది.  నల్లమల అటవీ ప్రాంతంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలు, అందమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలు, కృష్ణా తీరంలోని సోమశిల ప్రాంత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన నిధులు వెచ్చించనున్నాయి. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికై ఇన్నాళ్లు ఎటువంటి పాలసీ, విజన్​ లేకుండా పోయిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి వచ్చే రూ.65 కోట్లలో అత్యధికంగా సోమశిల ప్రాంతంలో వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు వీటికి సంబంధించిన డీపీఆర్​ను రూపొందిస్తున్నారు. నల్లమల అభయారణ్యంలోని అక్కమహాదేవి గుహలు మొదలుకుని తెలంగాణ అమర్​నాథ్​ యాత్రగా ప్రఖ్యాతిగాంచిన సలేశ్వరం, మల్లెల తీర్థం, లొద్దిమల్లయ్య, మద్దిమడుగు, ఆక్టోపస్, ఫర్హాబాద్​ వ్యూ పాయింట్, ప్రతాపరుద్రుడి కోట​అభివృద్ధికి రూ.25 కోట్లతో ప్రపోజల్స్​ సిద్ధం చేస్తున్నామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. 

మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జులై నెలలో రెండు రోజుల పాటు నల్లమలలో పర్యటించారు. నల్లమలను డెవలప్​ చేసి తెలంగాణ టూరిజం డెస్టినేషన్​గా మారుస్తామని మంత్రి జూపల్లి అక్కడ ప్రకటించారు. ఆ తరువాత అచ్చంపేట ఎమ్మెల్యే నల్లమలలో ప్రసిద్ధ ప్రాంతాలతో పాటు బయటి ప్రపంచానికి పరిచయం లేని ప్రాంతాల్లో పర్యటించారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్  టూరిజానికి నల్లమలను కేరాఫ్​గా మారుస్తామని ఎమ్మెల్యే అంటున్నారు.నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్  టైగర్​ రిజర్వ్ కు దూరంగా పురాతన శైవ క్షేత్రాల అభివృద్ధి, రోడ్డు సౌకర్యం, అడవిలో కాటేజీల నిర్మాణానికి ప్రపోజల్స్​ సిద్ధం చేస్తున్నారు. 

Also Read :- రైతు భరోసా కోసం చూస్తున్న రైతులకు ఈ విషయం తెలుసా..?

ఏప్రిల్​ నెలలో మూడు రోజులు మాత్రమే అనుమతించే సలేశ్వరం లోయకు ఏడాది పొడవునా అనుమతి లభిస్తే పర్యాటకులకు టూరిజం, ఫారెస్ట్​  డిపార్ట్​మెంట్లకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న జంగిల్​ సఫారీ ఫర్హాబాద్​ వ్యూ పాయింట్​ వరకు ఉంది. దీన్ని సలేశ్వరం వరకు, అటు నుంచి భౌరాపూర్​ వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కృష్ణా తీర ప్రాంతంలో రివర్  బోటింగ్​  కోసం జెట్టీల నిర్మాణం, లాంచీ స్టేషన్లు, వాటర్​ స్పోర్ట్స్, స్పీడ్​ బోట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కృష్ణా బ్యాక్​ వాటర్​లో అమరగిరి నుంచి సోమశిల వరకు, అటు నుంచి జటప్రోల్​ వరకు రివర్​ బోటింగ్​కు అవకాశం ఉంది.

సోమశిలపై స్పెషల్​ ఫోకస్..

కొత్త టూరిజం పాలసీలో టెంపుల్, రివర్​ టూరిజం ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీం కింద తుంగభద్ర నది తీరంలోని ఐదో శక్తి పీఠమైన జోగులాంబతో పాటు కృష్ణాతీరంలోని బీచుపల్లి, జటప్రోల్, సోమశిల ప్రాంతాలకు ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.141 కోట్లలో సోమశిల, నల్లమలకు రూ.65 కోట్లు కేటాయించినట్లు సమాచారం. సీఎం రేవంత్​ రెడ్డి ఈ ప్రాంతానికి చెందినవాడు కావడం, టూరిజం మినిస్టర్​ జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్​ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటం ఈ ప్రాంత టూరిజం అభివృద్ధికి కలిసివస్తోంది. సోమశిలలో టూరిజం కాటేజీలు ఉన్నాయి. రివర్​  బోటింగ్, శ్రీశైలానికి ఏసీ లాంచీ కొనసాగుతోంది. సోమశిల సమీపంలోని అమరగిరి, జటప్రోట్​ ప్రాంతాలకు ప్రత్యేకత ఉంది.

ప్రైవేట్​ భాగస్యామ్యంపై దృష్టి.. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ఎకో, టెంపుల్, రివర్, అడ్వెంచర్​ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్  భాగస్వామ్యంలో పలు ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పర్యాటకంగా నల్లమల, కృష్ణా తీర ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.