బతికుండగానే రికార్డుల్లో చంపేశారు

గన్నేరువరం, వెలుగు : తాను బతికుండగానే అధికారులు తనను చనిపోయిన వారి జాబితాలో చేర్చారని కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నూనె మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు మీడియాతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నాడు. అధికారులు మొదట తన రేషన్ కార్డును రద్దు చేశారని, ఆ తర్వాత చనిపోయిన వారి జాబితాలో తనను చేర్చారని పేర్కొన్నాడు. 

దీంతో తనకు రుణమాఫీ వర్తించడం లేదని ఆయన వాపోయాడు. కొంతమంది వ్యక్తులు కక్షతో అధికారులతో కుమ్మక్కై తనను చనిపోయిన వారి జాబితాలో చేర్పించారని ఆరోపించాడు. ఇప్పటికైనా తప్పిదాన్ని సరిచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు.