అక్కన్నపేట - మెదక్ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్​ పూర్తి

అక్కన్నపేట - మెదక్ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్​ పూర్తి
  • హైదరాబాద్ డివిజన్‌‌‌‌లో 1,004 కి.మీలకు చేరిన విద్యుదీకరణ ట్రాక్‌‌‌‌

హైదరాబాద్​సిటీ, వెలుగు:  అక్కన్నపేట–-మెదక్ రైల్వే లైన్‌‌‌‌ ఎలక్ర్టిఫికేషన్ను  అధికారులు పూర్తి చేశారు. రూ.15.49 కోట్ల వ్యయంతో 18.56 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్​పనులు పూర్తవ్వడంతో ట్రాక్ వినియోగంలోకి వచ్చింది. ఈ  పనులు పూర్తికావడంతో హైదరాబాద్ డివిజన్ లో  రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్​మొత్తం 1,004 కిలోమీటర్లకు  చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల నిర్మించిన మనోహరాబాద్–- సిద్దిపేట రైలు మార్గం మినహా.. ఈ డివిజన్ 100% విద్యుదీకరణను సాధించినట్టయ్యిందని వివరించారు.  అక్కన్నపేట రైల్వే స్టేషన్‌‌‌‌లో  నూతనంగా విద్యుదీకరించిన అక్కన్నపేట-– మెదక్ రైల్వే లైన్ ను ఈ నెల  21న దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్  బ్రిజ్ మోహన్ మీనా, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ విష్ణోయ్ తనిఖీ చేశారు.

 జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్ డివిజన్ విద్యుదీకరణ ఒక ముఖ్యమైన అడుగని అధికారులు తెలిపారు. ఇది ఇంధన ఖర్చులను ఆదా చేస్తూ, రైళ్లకు ఇంధనాన్ని అందించే  పర్యావరణ హితంగా పనిచేస్తుందన్నారు. అక్కనపేట –- మెదక్ రైల్వే లైన్ ను సికింద్రాబాద్–-నిజామాబాద్–- ఔరంగాబాద్, ముంబై వైపు అనుసంధానం చేస్తామని వివరించారు. ఈ రైల్వే లైన్ ఎలక్ర్టిఫికేషన్ వల్ల ఖర్చుతోపాటు పొల్యూషన్ తగ్గుతుందని తెలిపారు. అలాగే.. ఈ  సెక్షన్ లో మరిన్ని కోచింగ్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవకాశం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ డివిజన్‌‌‌‌లో డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌‌‌‌ మార్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.