కోరుట్లలో అక్రమ గుడిసెలు, ఇళ్ల తొలగింపు

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారు జంబి గద్దె ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇండ్లు, గుడిసెలను శుక్రవారం తెల్లవారుజామున అధికారులు కూల్చివేశారు.  ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 923లో దాదాపు ఏడాది క్రితం సీపీఎం లీడర్ల తో కలిసి పేదలు అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు.  కొందరూ సిమెంట్ బ్రిక్స్ తో రేకుల షెడ్లు కట్టుకున్నారు.

 శుక్రవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రాజేశ్వర్ ఆధ్వర్యంలో  రెవెన్యూ , మున్సిపల్ అధికారులు పోలీసు సిబ్బంది అక్రమంగా వేసుకున్న 40  తాత్కాలిక షెడ్లు,  9  పక్కా ఇండ్లను,  కొన్ని గుడిసెలను జేసీబీ సాయంతో కూల్చివేసి  భూమిని చదును చేశారు.  ముందస్తుగా16 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అవాంచనీయ సంఘటలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాజేశ్వర్ హెచ్చరించారు.