వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లో వానలు దంచి కొడుతున్నయ్.. వరదలు కాలనీలను ముంచెత్తుతున్నయ్. లోతట్టు ప్రాంతాలు మునిగినయ్.. రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నయ్.. దోమలు జనాల రక్తాలు తాగుతున్నయ్.. జ్వరాలు వచ్చి పేషెంట్లతో హాస్పిటల్స్ నిండుతున్నయ్.. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా అన్ని డివిజన్లలో సమస్యలు గుట్టల్లా పేరుకుపోయాయి. కాగా, వీటన్నింటిపై చర్చించి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన కౌన్సిల్ మీటింగ్ ను పాలకవర్గం నిర్వహించడం లేదు. గతంలో నెలకు రెండు మీటింగులు పెట్టగా.. గడిచిన ఏడు నెలల్లో కేవలం రెండు సమావేశాలు మాత్రమే జరిగాయి. కొత్త పాలకవర్గం ఏర్పడి నాలుగు నెలలు గడిచినా కేవలం ఒక్కదానితో సరిపుచ్చారు. అది కూడా సన్మానాలు, సత్కారాలకే పరిమతమైంది.
మే 7 నుంచి ఇదే పరిస్థితి..
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలిచి అధికార టీఆర్‍ఎస్ పార్టీ గ్రేటర్ పీఠాన్ని కైవలం చేసుకుంది. మేయర్‍గా గుండు సుధారాణి ఎంపికయ్యారు. ఈ ఏడాది మే 7న వరంగల్ కార్పొరేషన్ కొత్త పాలకవర్గంలోని కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, కార్పొరేషన్లో గడిచిన 7 నెలల్లో కేవలం రెండే మీటింగులు జరిగాయి. అవి కూడా ప్రజా సమస్యలపై చర్చించకుండానే ముగిశాయి. గత పాలకవర్గంలో మేయర్ గుండా ప్రకాశ్ నెలకు రెండు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి, గ్రేటర్ సమస్యలపై సుదీర్ఘ చర్చ పెట్టేవారు. అధికార, విపక్షమనే తేడా లేకుండా దాదాపు అన్ని డివిజన్ల సమస్యలపై స్పందించేవారు. గుండు సుధారాణి మేయర్‍గా జూన్ 29న మొదటి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కొత్త పాలకమండలి సభ్యులను సన్మానించడానికే పరిమితమైంది.
80 శాతం కార్పొరేటర్లు.. కొత్తవారే
ప్రస్తుత గ్రేటర్ వరంగల్ పాలకవర్గంలోని 66 మంది డివిజన్లలో 20శాతం మంది సిట్టింగులు మళ్లీ విజయం సాధించారు. మిగతా 80 శాతం మంది ఇప్పటి వరకు కౌన్సిల్ మీటింగుల్లో అధ్యక్షా..అని పిలిచిన అనుభవం లేదు. ఈ క్రమంలో సభలో తమ వాయిస్ వినిపించాలని కొందరు.. తమ డివిజన్ సమస్యలపై గొంతు విప్పాలని ఇంకొందరు వెయిట్ చేస్తున్నారు. సమావేశాలు ఎప్పుడుపెడుతారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
తల్లడిల్లుతున్న గ్రేటర్ వరంగల్ జనాలు
మొదట గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్.. దీనికిముందు ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జనం సమస్యలపై మాటల్లేవ్. చర్చలు అంతకంటే లేవు. సిటీ లీడర్లు ఎన్నికల పేరుతో హడావుడి శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేశారు. ఆపై కోడ్ రావడంతో డివిజన్లలో ఎన్నో పనులు పెండింగ్‍లో ఉన్నాయి. మధ్యలో వాటికి కొత్త సమస్యలు కలిశాయి. అప్పటి కమిషనర్ పమేలా సత్పతి బదిలీ కావడంతో రెండున్నర నెలలు ఆ పోస్ట్ ఖాళీగా ఉండి అభివృద్ధి పనులు స్లో అయ్యాయి. గడిచిన పది, పదిహేను రోజులుగా వరుస వానలు, వరదలతో గ్రేటర్ వరంగల్ తల్లడిల్లుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ బురదమయం కాగా.. ట్రైసిటీ అంతటా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపులు, శ్మశానవాటికలు, పార్కులు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారడంతో దోమలు పెరిగి సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ కేసులు పెరిగాయి. మొత్తంగా గ్రేటర్ వరంగల్ జనాలు సమస్యలతో తల్లడిల్లుతున్నారు.