- ప్రాజెక్టులు, చెరువులు, బోర్ల ద్వారా సాగునీరు
- 5.18 లక్షల ఎకరాల్లో పంటలు
- సీజన్ ముగిసేదాకా నీటి సప్లైకి ప్లాన్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో యాసంగి పంటలకు అధికారులు సాగునీటి భరోసా కల్పించారు. యాసంగికి ఎంత నీరు అవసరమవుతుందో లెక్క తేల్చారు. ప్రాజెక్టులు, లిఫ్ట్‌లు, చెరువులు, బోర్ల ద్వారా అందుబాటులో ఉన్న వనరులను పూర్తిగా వాడుకుని సీజన్ ముగిసేవరకు నీటిని సరఫరా చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయనున్నాయి.
జిల్లాలో సాగు విస్తీర్ణం 5.60 లక్షల ఎకరాలు కాగా యాసంగిలో 5.18 లక్షల ఎకరాల్లో సాగు జరగనుంది.
ఇందులో వరి 4.19 లక్షల ఎకరాల్లో, జొన్న 33,317 ఎకరాలు, శనగ 16,076 ఎకరాలు, సజ్జలు 10,302, నువ్వులు 8,239, పొద్దు తిరుగుడు 2,790, మినుము 619, కుసుమ 378, సోయాబిన్, పొగాకు తదితర పంటలు 4,067 ఎకరాలలో సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు. జిల్లాకు ప్రధాన ఆదరువయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.802 టీఎంసీల నారుంది. వానాకాలంలో ప్రాజెక్ట్‌లోకి పూర్తి నీటిమట్టం చేరింది. 80.5 టీఎంసీల కెపాసిటీ గల ఎస్సారెస్పీ కూడా నిండుకుండలా ఉంది.
వీటితోపాటు అలీసాగర్, గుత్ప, రామడుగు, చౌట్పల్లి ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల కింద 2.76 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిచనున్నారు. ప్రాజెక్టుల కింద వారాబందీ(ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతి)లో నీటిని విడుదల చేస్తారు. యాసంగిలో సాగయ్యే జొన్న, సోయా, మినుము, సజ్జ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు పంటలకు పెద్దగా నీటి అవసరం ఉండదు.
Also Read :- ఇక తెలుగులో జీవోలు..
ఇవి 75,788 ఎకరాల్లో సాగవుతున్నాయి. జిల్లాలో దాదాపు 1.83 లక్షల అగ్రికల్చర్ బోర్ల కింద సుమారు 2.42 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీరందనుంది. బోర్ల కింద సేద్యానికి ప్రతిరోజు 3.5 మిలియన్ యూనిట్ల కరెంట్ కావాలి. వచ్చే మూడు నెలల్లో కరెంటు డిమాండ్ మరింత పెరిగి 6.0 మిలియన్ యూనిట్లకు చేరే సూచనలు ఉన్నాయి. ఆ మేరకు ఎన్పీడీసీఎల్ ప్లాన్ చేస్తోంది. పంటలకు నాణ్యమైన కరెంట్ సప్లైకి ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.
ఏ ప్రాజెక్ట్ద్వారా ఎన్ని ఎకరాలు
ప్రాజెక్ట్ ఆయకట్టు
(ఎకరాల్లో)
నిజాంసాగర్ 32,600
ఎస్సారెస్పీ (లక్ష్మీకెనాల్) 25,763
అలీసాగర్ లిఫ్టు 47,662
గుత్ప లిఫ్టు 32,698
చౌట్పల్లి ఎత్తిపోతలు 8,297
రామడుగు 6,104
చెరువులు, కుంటలు 1,66,750