ఖమ్మంలో ఆక్రమణలపై ఫోకస్‌.. స్థానికుల ధర్నాతో రంగంలోకి బల్దియా

ఖమ్మంలో ఆక్రమణలపై ఫోకస్‌.. స్థానికుల ధర్నాతో రంగంలోకి బల్దియా
  • వరద కాల్వను ఆక్రమించి వెలిసిన నిర్మాణాలు.. కూల్చివేతలకు రెడీ అయిన ఆఫీసర్లు
  • స్థానికుల ధర్నాతో రంగంలోకి బల్దియా
  • కాల్వ పక్కన ఉన్న ఐస్‌‌‌‌ ఫ్యాక్టరీ కూల్చేందుకు ఏర్పాట్లు 
  • అమ్మోనియా గ్యాస్‌‌‌‌ లీక్‌‌‌‌తో ఆగిన పనులు
  • మొత్తం ఆక్రమణలను తొలగిస్తామన్న ఆఫీసర్లు


ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఆఫీసర్లు సిద్ధమయ్యారు. ఇటీవల భారీ వర్షాలు పడడంతో ఖమ్మం నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇందుకు నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని, వాటిని తొలగించాలని రెండు రోజుల కింద కాలనీవాసులు ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు కబ్జాలు, అక్రమ నిర్మాణాల గుర్తింపు, తొలగింపునకు చర్యలు చేపట్టారు. 

సగానికి సగం ఆక్రమణకు గురైన కాల్వ

మున్నేరుకు భారీ వరద వచ్చిన టైంలో దాన్ని అనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం సాధారణమే. కానీ ఈ ఏడాది ఖమ్మం నగరంలోని కవిరాజ్‌‌‌‌నగర్‌‌‌‌, చైతన్యనగర్‌ ‌‌‌కాలనీల్లో 6 నుంచి 8 అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో ఆయా ఏరియాల్లోని వందలాది ఇండ్లు ముంపునకు గురయ్యాయి. రఘునాథపాలెం చెరువు అలుగు నీళ్లు ఖానాపురం చెరువుకు, అక్కడి నుంచి వచ్చే వరద లకారం చెరువుకు, ఆ తర్వాత ధంసలాపురం చెరువుకు నీరు చేరేందుకు కాల్వ ఉంది. ఈ కాల్వ నక్ష ప్రకారం 170 అడుగులు ఉండాలని స్థానికులు చెబుతున్నారు.

 గత పదేళ్లుగా కాల్వను ఆక్రమిస్తూ అపార్ట్‌‌‌‌మెంట్లు, స్కూళ్లు, భారీ నిర్మాణాలు వెలిశాయి. నాలాను ఆక్రమిస్తూ ప్లాట్లు చేయగా అవి ఇప్పటికే చాలా మంది చేతులు మారాయి. ప్లాట్లలోకి నీరు రాకుండా మట్టి పోయడం, కాల్వ రెండు వైపులా ఆక్రమ నిర్మాణాలు వెలియడంతో 30 నుంచి 40 అడుగులకు కుచించుకుపోయింది. కొన్ని చోట్ల అంతకంటే తక్కువ వెడల్పే ఉంది. దీంతో పైనుంచి వచ్చే వరద సాఫీగా వెళ్లకుండా కాలనీల్లోకి చేరుకుంది. 

Also Read :- కాలువ గండి పూడ్చివేత పనులు ప్రారంభం

కూల్చివేతలు షురూ..

ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ధర్నా చేయడంతో స్పందించిన ఆఫీసర్లు కబ్జాలను కూలగొట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లకారం కాల్వను ఆక్రమించి కట్టిన ఐస్‌‌‌‌ ఫ్యాక్టరీని తొలగించాలని నిర్ణయించారు. సోమవారం ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని షెడ్డును కాస్త తొలగించగానే అమ్మోనియా గ్యాస్‌‌‌‌ లీక్‌‌‌‌ అవుతుండడాన్ని గుర్తించారు. దీంతో వెంటనే కూల్చివేతను ఆపేశారు. 

అమ్మోనియా గ్యాస్‌‌‌‌ సమస్య పరిష్కారం అయ్యాక మంగళవారం ఉదయం షెడ్‌‌‌‌ను కూల్చివేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. అలాగే కాల్వకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని సైతం కూల్చివేస్తామని ఆఫీసర్లు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై కూడా చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌అభిషేక్‌‌‌‌ అగస్త్య చెప్పారు. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కాల్వలో పూడికతీత పనులు స్టార్ట్‌‌‌‌ చేశారు.

100 ఫీట్లు అయినా విస్తరించాలంటున్న స్థానికులు

యాభై ఏండ్లలో ఎన్నడూ రాని వరదలకు కారణమైన ఆక్రమణలపై ఆఫీసర్లు ఇప్పటికైనా దృష్టిపెట్టడం హర్షణీయమని స్థానికులు అంటున్నారు. కాల్వను ఇష్టం వచ్చినట్లు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను తొలగించి, కనీసం 100 ఫీట్ల వీరకైనా విస్తరించాలని అంటున్నారు. కాలనీవాసుల ధర్నా కారణంగా మొదలుపెట్టిన కూల్చివేతలపై ఆఫీసర్లు సీరియస్‌‌‌‌గా దృష్టి, వరద ముప్పు నుంచి కాపాడాలని కోరుతున్నారు.


కబ్జాలను తొలగించాలి 

హైదరాబాద్‌‌‌‌లో హైడ్రా వ్యవస్థను ఏర్పాటుచేసి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మంచి పనిచేశారు. ఖమ్మంలోనూ అలాంటి వ్యవస్థను తీసుకురావాలి. అక్రమ కట్టడాలు, నాలాల్లో కబ్జాలను తొలగించాలి. అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటే మళ్లీ ముంపు సమస్య తలెత్తకుండా ఉంటుంది. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే ధర్నా చేశాం తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదు. 
- పద్మజారెడ్డి, కవిరాజ్‌‌‌‌నగర్‌‌‌‌, ఖమ్మం

మరిన్ని వార్తలు