- ఉమ్మడి జిల్లాలో పరీక్ష రాయనున్న 34,438 మంది అభ్యర్థులు
- పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్--3 పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం, సోమవారం జరిగే పరీక్షకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 34,438 మంది అభ్యర్థులు హాజరు కానుండగా ఇందుకోసం 105 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగే పరీక్షల నిర్వహణకు ప్రతి సెంటర్‌కు ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ తో పాటు, అవసరమైనంత మంది ఇన్విజిలెటర్లను నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లు, రూట్ ఆఫీసర్లను నియమించారు. పరీక్ష జరిగే కేంద్రాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో గ్రూప్- -3 పరీక్షకు 13,408 మంది అభ్యర్థులు హాజరవుతుంటే వారి కోసం జిల్లాలో 37 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 385 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో4 రూట్ మొబైల్స్, 4 ఎస్కార్ట్ పార్టీలను ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో 5,867 మంది అభ్యర్థులు గ్రూప్ --3 పరీక్షకు హాజరుకానున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ మెంచు నగేశ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ పట్టణంలో 12, రామాయంపేటలో 2, తుప్రాన్ లో 2, నర్సాపూర్‌లో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్-- 3 పరీక్ష జరిగే కేంద్రాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో...
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 15,163 మంది అభ్యర్థులు గ్రూప్ --3 పరీక్ష రాయనున్నారు. ఈ మేరకు జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 119 మంది ఇన్విజిలేటర్లు, 15 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించగా, ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక డిపార్ట్మెంటు ఆఫీసర్‌ను నియమించారు. గ్రూప్ 3 పరీక్ష జరిగే కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.