పక్కాగా ఎగ్జామ్స్​ .. టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పక్కాగా ఎగ్జామ్స్​ .. టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
  • ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 184 ఎగ్జామ్​సెంటర్లు 
  • హాజరుకానున్న 35,148 మంది విద్యార్థులు 
  • ఈసారి గ్రేడింగ్ బదులు మార్కుల రూపంలో రిజల్ట్

ఆదిలాబాద్, వెలుగు : టెన్త్ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలకు కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఫర్నీచర్, టాయిలెట్స్ వంటి వసతులు సిద్ధం చేశారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచనున్నారు. ఎగ్జామ్​లో విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఇందులోనే మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ సారి గ్రేడింగ్ కాకుండా మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడించనున్నారు.

ఈసారి మాత్రమే ఇంటర్నల్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లా కేంద్రాలకు చేరుకోగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

35,148 మంది విద్యార్థులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి 184 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 35,148 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ ​సూపరింటెండెంట్, డిపార్ట్​మెంట్ అధికారులు, కస్టోడియన్, ఇన్విజిలేటర్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ అధికారులను నియమించి ఇప్పటికే ట్రైనింగ్​ఇచ్చారు. మాస్ కాపియింగ్ పాల్పడకుండా చర్యలు చేపట్టనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు.  

అధికారులు దిశానిర్దేశం

కాగజ్ నగర్/నిర్మల్/మంచిర్యాల, వెలుగు: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో చల్లని తాగునీరు, విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు వైద్య సిబ్బందిని నియమించి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కాగజ్ నగర్ ప్రభుత్వ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్​ సెంటర్​ను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. 

టెన్త్​పరీక్షల నిర్వహణపై నిర్మల్​ కలెక్టరేట్​లో సంబంధిత అధికారులు, ప్రైవేట్​ స్కూళ్ల యజమానులతో అడిషనల్​కలెక్టర్ ​కిశోర్​ కుమార్​ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. డీఈవో రామారావు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాలలో డీఈవో యాదయ్య సైతం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 70324 63114, 94406 88034కు కాల్ చేయాలని సూచించారు. 

ఉమ్మడి జిల్లాలో పరీక్షల వివరాలు

జిల్లా   విద్యార్థులు    కేంద్రాలు 
ఆదిలాబాద్        10,051    52
మంచిర్యాల          9,189    49
కొమురం భీం        6,779    36
నిర్మల్         9,129    47
మొత్తం        35,148    184