మహబూబాబాద్/ ములుగు/ తొర్రూరు, వెలుగు: టీజీపీఎస్సీ గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్జిల్లాలో 21పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్-3 కి 7592 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు 21, రూట్ ఆఫీసర్స్ 6, జిల్లాస్థాయి ప్రత్యేక అధికారులు 24 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 10, ఐడెంటిఫికేషన్ అధికారులు 86మందిని నియమించినట్లు తెలిపారు. పరీక్షలు జరిగే స్కూల్స్, కాలేజీలకు లోకల్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు.
సమీక్షలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, వీరబ్రహ్మచారి, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.బలరాం నాయక్, ఆర్డీవో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో 9 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 2173 మంది హాజరుకానున్నట్లు కలెక్టర్దివాకర ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ అధికారులు హనుమకొండ నుంచి 4, ఏటూరు నాగారం నుంచి 4 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 18004257109ను సంప్రదించాలని సూచించారు.
మహబూబాబాద్జిల్లా తొర్రూరు సర్కిల్లోని 8 పరీక్షా కేంద్రాలను డీఎస్పీ కృష్ణకిషోర్, సీఐ జగదీశ్, ఎస్సై ఉపేందర్పరిశీలించారు. సర్కిల్పరిధిలోని కేంద్రాల్లో 3364 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని డీఎస్పీ తెలిపారు. అభ్యర్థులను క్షణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించాలని సిబ్బందికి సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మౌలిక వసతులు కల్పించాలని అన్నారు..