
- బడిబాట’ను ప్రారంభించిన కలెక్టర్లు
నిర్మల్/ఆదిలాబాద్/జన్నారం, వెలుగు: మరికొద్ది రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చేరికపై అధికారులు ఫోకస్ పెట్టారు. కలెక్టర్లు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్మల్ గ్రామీణ మండలం అక్కాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం, రాగిజావ, ఇతర ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కార్యక్రమంలో భాగంగా జరిగిన పనులను కలెక్టర్ పరిశీలించారు. స్టూడెంట్ల యూనిఫామ్‌లను హెచ్ఎంలకు అందజేశారు. డీఈవో రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బడీడు పిల్లలందరినీ స్కూల్లో చేర్పించాలి
ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసి మండలంలోని జడ్పీ హై స్కూల్లో బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. స్కూల్ స్టూడెంట్లకు యూనిఫామ్‌లు అందించారు. చదువుకు దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని జిల్లా యంత్రాగం విజయవంతం చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈవో ప్రణీత, డిప్యూటీ ఈఈ శివరాం, డీపీఎం గంగన్న, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. జన్నారం మండలంలోని కలమడుగు గవర్నమెంట్ హైస్కూల్లో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి డీఈవో యాదయ్య హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని, కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేస్తున్నట్లు వివరించారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులతో పాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.