ఆదిలాబాద్​ జిల్లాలో సీజనల్ వ్యాధులపై యాక్షన్ ప్లాన్ రెడీ

  • వానాకాలంలో రోగాల వ్యాప్తి నివారణకు చర్యలు
  • ప్రతి ఏటా వందల సంఖ్యలో ఫివర్ కేసులు నమోదు
  • ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అప్రమత్తం
  • ఆదిలాబాద్​జిల్లాలో 165 హై రిస్క్ ప్రాంతాల గుర్తింపు 
  • జూలై 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ర్యాపిడ్ ఫివర్ సర్వే

ఆదిలాబాద్, వెలుగు : ప్రతి ఏటా వానాకాలంలో ఆదిలాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. జిల్లాలో ప్రతి ఏటా డయేరియా, డెంగ్యూ, మలేరియా, ఇతర విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీరు, రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారై మలేరియీ, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 

జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, సిరికొండ, నార్నూర్ గుడిహత్నూర్ మండలాల్లో డెంగ్యూతో పాటు వైరల్ ఫివర్ కేసులు పెరుగుతున్నాయి. గతేడాది 108 డెంగ్యూ కేసులు, 02 మలేరియా కేసులు నమోదు కాగా వందల సఖ్యలో వైరల్ జ్వరాలతో రోగులు మంచాన పడ్డారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది క్షేత్రస్థాయిలో వ్యాధి నివారణ చర్యలు, వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు, ఫివర్ సర్వేలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

24 గంటలపాటు వైద్య సేవలు

జిల్లాలో 22 పీహెచ్​సీలు, ఒక సీహెచ్​సీ, ఒక ఏరియా హాస్పిటల్, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, 126 సబ్ సెంటర్లున్నాయి. వానాకాలంలో ముఖ్యంగా పాముకాటు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ బాధితులకు ఉపయోగించే మందులు యాంటీ స్నేక్ వీనమ్​ను అన్ని పీహెచ్​సీల్లో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. మలేరియా, డయేరియ డ్రగ్స్, కుక్క కాటుకు సంబంధించిన యాంటీ రేబిస్, ఓఆర్ఎస్, ఐవీ ఫ్ల్యూయిడ్స్, నార్మల్ సెలైన్​లు, పలు రకాల యాంటీ బయోటిక్స్, పారాసిటమాల్ అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

ప్రతి పీహెచ్​సీలో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచగా, ఆశా వర్కర్లకు 150 ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, సీఎస్సీలకు వచ్చే వారికి 24 గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో డెలివరీ అయ్యే గర్భిణులను ముందస్తు గుర్తించి.. ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్నారు. జూలై 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ర్యాపిడ్ ఫివర్ సర్వే నిర్వహించనున్నారు. దీంతో పాటు 15 రోజుల పాటు యాంటీ డయేరియా కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు. 

165 హైరిస్క్ ప్రాంతాల్లో మెడికల్ ​క్యాంపులు

గతంలో నమోదైన డయేరియా, డెంగ్యూ, మలేరియా కేసులను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది జిల్లాలో 165 ప్రాంతాలను హైరిస్క్​గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మూడు నెలలు ఫివర్ సర్వేతో పాటు మెడికల్ క్యాంపులు, యాంటీ లార్వా, మస్కిటో ఆపరేషన్లు వంటివి చేపట్టనున్నారు. 

ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం

సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గ్రామల్లో అవగాహన కల్పిస్తున్నాం. పీహెచ్​సీ, సీహెచ్​సీల్లోని డాక్టర్లను అప్రమత్తం చేశాం. అన్ని హాస్పిటళ్లలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాం. మరిన్ని మందుల కోసం సెంట్రల్ డ్రగ్ స్టోర్​కు ప్రతిపాదనలు పంపించాం. డయేరియా, మలేరియా, విష జ్వరాలు, వాంతులు, కడుపునొప్పి లాంటి సమస్యలకు మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీహెచ్​సీలో డాక్టర్లు ఉన్నారు. త్వరలో కొత్తగా స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయనున్నాం.

నరేందర్ రాథోడ్, డీఏంహెచ్ఓ