శంషాబాద్ లో బాలికకు అబార్షన్ చేసిన ఆస్పత్రి సీజ్

శంషాబాద్ లో బాలికకు అబార్షన్ చేసిన ఆస్పత్రి సీజ్

శంషాబాద్, వెలుగు : బాలిక కు అబార్షన్ చేసిన కేసులో ఆస్పత్రిపై రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తూరులోని శ్రీనివాస క్లినిక్ ను శుక్రవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. బాలికను గర్భవతిని చేసి.. అబార్షన్ చేయించిన ఘటన సంచలనంగా మారినది తెలిసిందే. ఆస్పత్రికి చెందిన డాక్టర్  తీరుపైనా వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుర్వేదిక్ డాక్టర్ గా రంజిత్ పర్మిషన్ తీసుకుని అల్లోపతి ట్రీట్ మెంట్ చేయడం, శ్రీ లక్ష్మీ మెడికల్ హాల్ పేరిట క్లినిక్ నిర్వహణ  రూల్స్ విరుద్ధంగా ఉంది.  ఆలస్యంగానైనా అధికారులు ఆస్పత్రిని సీజ్ చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 

సహకరించిన వారిపైనా చర్యలు తీసుకోవాలి

మైనర్ బాలికకు జరిగిన ఘటనలో బాధిత కుటుంబాన్ని రంగారెడ్డి జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ పరామర్శించారు. అనంతరం బాలిక తండ్రితో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిందితుడిని సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బానావత్ సాయి లాల్ నాయక్, ఎస్టీ మోర్చా శంషాబాద్ అధ్యక్షుడు రవీందర్ నాయక్, ఎస్టీ మోర్చా అధికార ప్రతినిధి అనూష, రంగారెడ్డి రూరల్ జిల్లా ఇన్ చార్జ్  భాస్కర్ నాయక్ తదితరులు ఉన్నారు.

ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తే క్రిమినల్ కేసులు– రంగారెడ్డి డీఎంహెచ్ వో వెంకటేశ్వరరావు
  
షాద్ నగర్: రూల్స్ కు విరుద్ధంగా మెడికల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి డీఎంహెచ్ వో  డాక్టర్ బి. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తే  క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. గర్భిణి అయిన బాలికకు అబార్షన్ చేసిన కేసులో కొత్తూరులోని శ్రీనివాస క్లీనిక్ శుక్రవారం సీజ్ చేశారు.  క్లీనిక్ డాక్టర్ వి. రంజిత్ కు  రెండు నెలల కిందటే డివిజన్ వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి కూడా నోటీసులు జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. హోమియోపతి డాక్టర్ చదువుకున్నారో అదే ప్రాక్టీస్ చేయాలని నోటీసు కూడా ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు.  జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ తిరుపతి రావు, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ కె. శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.