వనపర్తి, వెలుగు : వనపర్తిలో హైడ్రా తరహాలో అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. గురువారం గోపాల్పేటరోడ్డులోని నల్లచెరువు (మినీ ట్యాంక్ బండ్) ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో వెంచర్ వేసి ప్లాట్లు ఏర్పాటు చేశారని, ఏకంగా చెరువు నీరు వెంచర్లోకి రాకుండా గోడను నిర్మించారని గుర్తించిన మున్సిపల్ అధికారులు దాన్ని కూల్చేశారు. నల్లచెరువు లోని ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న వారికీ నోటీసులు ఇచ్చారు.
ఈ ఒక్క చెరువు పరిధిలోని గత కొన్నేళ్ల కింద చెరువు వట్టిపోయినప్పుడు వేసిన వెంచర్లో దాదాపు 400 దాకా ప్లాట్లు కొన్నారు. ఇందులో చాలా మటుకు ఇళ్లు నిర్మించుకున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని ఇళ్లు ముంపునకు గురైన విషయం తెలిసిందే. తాజాగా అధికారులు మర్రికుంట, తాళ్లచెరువు, అమ్మచెరువు పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ప్లాట్లు నిర్మాణాలను గుర్తిస్తున్నారు. ఆ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.