రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక
  •     మళ్లీ పెరుగుతున్న గోదావరి
  •     ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద మొదటి  ప్రమాద హెచ్చరిక
  •     అప్రమత్తమైన యంత్రాంగం
  •     24 గంటల పాటు పనిచేస్తున్న ప్రభుత్వ కంట్రోల్‌‌ రూమ్‌‌లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు :  ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది మళ్లీ పెరుగుతోంది. ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ముంపు గ్రామాల ప్రజలను అలెర్ట్‌‌ చేశారు.   ఎలాంటి ఘటనలు  జరగకుండా  ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. మూడు జిల్లాల్లో   ఏర్పాటు చేసిన కంట్రోల్‌‌ రూమ్స్​  24 గంటల పాటు పనిచేసేలా సిబ్బందిని నియమించారు. 

మొదటి  ప్రమాద హెచ్చరిక  

ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్‌‌ బ్యారేజీ వద్ద 9.67 లక్షల క్యుసెక్కుల ఇన్‌‌ ఫ్లో, అవుట్‌‌ ఫ్లో నమోదు కాగా, భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద 7.67 లక్షల క్యుసెక్కుల వరద వస్తున్నట్లుగా ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు ప్రకటించారు. ములుగు జిల్లాలోని రామన్నగూడెం దగ్గర 15.52 మీటర్ల హైట్‌‌తో గోదావరి  నది ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడ గోదావరి నీటి ప్రవాహం 14.82 మీటర్లు దాటగానే ఆఫీసర్లు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ఒడ్డున ఉన్న రామన్నగూడెం శ్మశాన వాటిక, ప్లాంటేషన్‌‌లోకి గోదావరి వరద వచ్చింది.   సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సాగర్‌‌ బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచారు. 

 24 గంటల  కంట్రోల్‌‌ రూములు

భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఆఫీసర్లు  అలర్ట్‌‌ ప్రకటించారు. భూపాలపల్లి లోని మహాదేవ్‌‌పూర్‌‌, పలిమెల, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, భద్రాచలం జిల్లాలోని తీర ప్రాంతంలోని భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల ప్రజలు మరో 36 గంటల పాటు ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లు దాటి బయటకు రావొద్దని సూచించారు.    మూడు జిల్లాల్లో అధికారులు 24 గంటల కంట్రోల్​​ రూమ్స్​  ఏర్పాటు చేశారు.

 భూపాలపల్లి  కలెక్టరేట్‌‌లో కంట్రోల్‌‌ రూమ్‌‌ 9030632608,  18004251123 నంబర్లు కు కాల్ చేయాలని  కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ములుగు జిల్లా కంట్రోల్‌‌ రూమ్‌‌ ఏటూరునాగారంలోని ఐటీడీఏలో ఏర్పాటు చేశారు.  6309842395, 08717-293246 కాల్‌‌ చేయాలని ములుగు జిల్లా కలెక్టర్‌‌ టీఎస్‌‌.దివాకర ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీడీఏ భద్రాచలం పరిధిలో కంట్రోల్‌‌ రూమ్‌‌ ఏర్పాటు చేశారు. 7995268352 హెల్ప్‌‌లైన్‌‌ నెంబర్‌‌ ఇచ్చారు.