- హైదరాబాద్‌లోని బేగంపేటలో స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు
సికింద్రాబాద్, వెలుగు : హైదరాబాద్ లోని బేగంపేట ప్రకాశ్ నగర్ లో 7 క్వింటాళ్ల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీకి చెందిన ఆహార భద్రతా విభాగం అధికారులు శుక్రవారం ప్రకాశ్ నగర్ లోని బాలయ్య చికెన్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బేగంపేటప్రకాశ్నగర్కు చెందిన బాలయ్య (36) పది నెలల క్రితం అదే ప్రాంతంలో బాలయ్య చికెన్ సెంటర్ పేరుతో షాపు ఓపెన్ చేశాడు. కోడి కాళ్లు, తల, ఇతర భాగాలను సేకరించి తన షాపులోని ఫ్రిజ్‌లో భద్రపరుస్తున్నాడు.
అలా దాచిన చికెన్‌ను సిటీలోని బార్లు, కల్లు దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అమ్ముతున్నాడు. నెల రోజుల క్రితం సేకరించి దాచిపెట్టిన చికెన్, ఎముకలు, తల, ఇతర భాగాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదంతా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆ మాంసానికి కెమికల్స్వేసి వివిధ దుకాణాలకు అమ్ముతున్నాడని అధికారులు గుర్తించారు. సిటీలో ఇంకా ఇలాంటి చికెన్ షాపులు ఎన్ని ఉన్నాయో పరిశీలిస్తున్నామని వెల్లడించారు. నిర్వాహకుడు బాలయ్యపై కేసు నమోదు చేశామని, చికెన్ సెంటర్‌ను సీజ్ చేశామని వెటర్నరీ డాక్టర్ మారుతి తెలిపారు.