టీచర్ల జీవితాలతో అధికారుల చెలగాటం

మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాలో టీచర్ల అలాట్​ మెంట్​ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. అంతేగాక కంప్యూటర్‌‌‌‌ ఆపరేటర్ల ఇష్టారాజ్యం వల్ల ఒక జిల్లాకు వెళ్లాల్సిన వారు ఇంకో జిల్లాకు కేటాయిస్తున్నారు. దీని వల్ల టీచర్లు మానసిక క్షోభకు గురై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాలో లాంగ్వేజ్​ పండిట్​ హిందీ డీఎస్సీ టీచర్ల జాబితా నియామక తేదీ బదులుగా డీఎస్సీ మార్కుల ఆధారంగా రూపొందించారు. ఇక్కడే తిరకాసు ఉంది. 17.10.2002 నుంచి 15 రోజుల్లో నియామకమైన వారితో పాటు 7 ఏండ్ల తర్వాత నియామకమైన వారిని కూడా జాబితాలో చేర్చి సమస్యలను సృష్టించారు.

ఈ సమస్య ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరి అధికారుల మెడకు చుట్టుకుంది. అయినా కానీ వారు సమస్యను పరిష్కరించకుండా అలాగే వదిలేసారు. దీనివల్ల సుమారు 300 మంది టీచర్ల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్​ హిందీ అలకేషన్‌‌ విషయంలో నిర్లక్ష్యం కారణంగా గద్వాల జిల్లా స్థానికులను వారి మొదటి ఆప్షన్‌‌ గద్వాలకు కాకుండా వికారాబాద్​, మహబూబ్‌‌ నగర్, వనపర్తి జిల్లాలకు కేటాయించారు. దీనికి తోడు స్కూల్​ అసిస్టెంట్​ తెలుగు అలకేషన్‌‌లో వనపర్తి ఆప్షన్‌‌ పెట్టుకున్న 200 మందిని నాగర్‌‌‌‌ కర్నూలుకు.. నాగర్‌‌‌‌ కర్నూలు ఆప్షన్​ పెట్టుకున్న వారికి వనపర్తి, గద్వాల, వికారాబాద్‌‌ జిల్లాలు కేటాయించి, తిరిగి అందరినీ వనపర్తికి కేటాయించారు. 

లాంగ్వేజ్​ పండిట్ తెలుగులో కూడా డీఎస్సీలను తప్పుగా నమోదు చేసి సుమారు 100 మందిని ఇబ్బందులకు గురిచేశారు. 2002 డీఎస్సీకి బదులుగా 2012 అని నమోదు చేశారు. 2001 సంవత్సరానికి బదులు 2000గా నమోదు చేశారు. ఇలా మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ సిబ్బంది టీచర్ల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పండితులను కూడా ప్రిఫరెన్షియల్‌‌ కేటగిరీలో కేటాయించకుండా వారిని కూడా అధికారుల ఇష్టం వచ్చిన జిల్లాలకు కేటాయించి చేతులు దులుపుకున్నారు. అసలు ఈ కేటాయింపులు ఏ పద్ధతిలో ఏ రూల్స్‌‌ ఆధారంగా చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ విషయంలో లోతుగా విచారణ జరిపి బాధ్యులైన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని, జిల్లా జాబితాలను తిరిగి రూపొందించి అందరికీ తిరిగి న్యాయం చేయాలి.

– సి.జగదీశ్, రాష్ట్ర అధ్యక్షుడు, 

రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు