యువతి కిడ్నాప్.. లైంగికదాడికి యత్నం

యువతి కిడ్నాప్.. లైంగికదాడికి యత్నం
  • తప్పించుకొని బంధువులకు చెప్పిన బాధితురాలు
  • నిందితుడైన ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించిన బంధువులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఓ ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ యువతిని కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో యువతి తప్పించుకొని పారిపోయింది. విషయం తెలుసుకున్న యువతి బంధువు పట్టణం మొత్తం గాలించి ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన శనివారం కొత్తగూడెంలో జరిగింది.

.వివరాల్లోకి వెళ్తే... కరకగూడెం గ్రామానికి చెందిన అంజలి అనే యువతి కొత్తగూడెంలోని రామా టాకీస్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో ఉంటున్న, తన బంధువైన జానకి ఇంటికి వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెం బస్టాండ్‌‌‌‌‌‌‌‌కు వచ్చింది. అంజలికి మాటలు స్పష్టంగా రాకపోవడంతో ఆమె చెప్పే అడ్రస్‌‌‌‌‌‌‌‌ ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ గుగులోత్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌కు అర్థం కాలేదు. దీంతో పక్కనే ఉన్న మరో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ యువతి దగ్గర ఉన్న సెల్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి అడ్రస్‌‌‌‌‌‌‌‌ కనుక్కొని కుమార్‌‌‌‌‌‌‌‌కు చెప్పాడు.

దీంతో కుమార్‌‌‌‌‌‌‌‌ యువతితో పాటు మరో వ్యక్తిని ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. అయితే ఆమె చెప్పిన అడ్రస్‌‌‌‌‌‌‌‌కు కాకుండా హేమచంద్రాపురం రోడ్డులోని రైల్వే గేట్‌‌‌‌‌‌‌‌ పక్కన గల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన యువతి ‘ఎక్కడికి తీసుకెళ్తున్నారు’  అంటూ అడిగింది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌తో పాటు, మరో వ్యక్తి యువతిపై అత్యాచారానికి యత్నించారు.

వెంటనే ఆటోలోంచి దిగిన యువతి రైల్వే గేట్‌‌‌‌‌‌‌‌ వైపు పరుగెత్తి అక్కడ డ్యూటీలో ఉన్న ఉద్యోగికి విషయం చెప్పింది. పరిస్థితిని గమనించిన ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌, యువకుడు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత రైల్వే ఉద్యోగి యువతి వద్ద ఉన్న నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి విషయం చెప్పారు. అయితే గంట సేపు అయినా అంజలి రాకపోవడంతో ఆందోళన చెందిన జానకి బస్టాండ్‌‌‌‌‌‌‌‌కు వచ్చి వెదుకులాట ప్రారంభించింది. ఇదే టైంలో రైల్వే ఉద్యోగి నుంచి ఫోన్‌‌‌‌‌‌‌‌ రావడంతో జానకి వచ్చి అంజలిని తీసుకెళ్లింది.

తర్వాత కొత్తగూడెం పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. అంతటితో వదిలేయకుండా.. జానకి తన భర్త ఆదర్శ్‌‌‌‌‌‌‌‌తో పాటు బంధువుల సాయంతో బస్టాండ్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ ఆనవాళ్లు గుర్తించడంతో పాటు, అడ్రస్‌‌‌‌‌‌‌‌ కోసం మొదట ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి నిందితుడి ఆటో ఆనవాళ్లు తెలుసుకొని పట్టణంలో వెతుకులాట ప్రారంభించింది.

ఈ క్రమంలో పట్టణంలోని సూపర్‌‌‌‌‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌ నుంచి మెయిన్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ వెళ్లే దారిలో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ విగ్రహం ఏరియాలో ఆటోను గుర్తించిన జానకి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ పారిపోయే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లు, మరో ఆటోను ఢీకొని ఆగిపోయాడు. తర్వాత స్థానికులతో పాటు జానకి కలిసి కుమార్‌‌‌‌‌‌‌‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించింది.