రాత్రి వేళల్లో ఆటోల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే జాగ్రత్త..

రాత్రి వేళల్లో ఆటోల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే జాగ్రత్త..

అప్పట్లో దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళని విన్నాం.. అయితే, కాలక్రమేణా ఈ తరహా దొంగతనాలు అంతరించిపోయాయి. పల్లెలు అభివృద్ధి చెందటం, పోలీస్ వ్యవస్థ విస్తరించటం వంటి అంశాలు దీనికి కారణమని చెప్పచ్చు. కానీ.. ఇటీవల జరిగిన పలు సంఘటనలు చూస్తే..  దారి దోపిడీ దొంగలు మళ్ళీ వచ్చారా అన్న అనుమానం వస్తోంది. ఇటీవల హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో ఓ వాహనదారున్ని బెదిరించి నగలు, డబ్బు దోచుకున్న సంఘటన మరువక ముందే అలాంటిదే.. మరో ఘటన చోటు చేసుకుంది. రాత్రి ఇంటికి వెళ్లడం కోసం ఆటో ఎక్కిన ప్రయాణికుడిని తన స్నేహితులతో కలిసి బెదిరించి డబ్బు కాజేశాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కిన ప్రయాణికున్ని కత్తితో బెదిరించి ఒక ఆటో డ్రైవర్ దోపిడీ చేసిన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆర్ సి పురంకి చెందిన 25ఏళ్ళ అభిషేక్ కుమార్ ఒక ప్రైవేటు ఉద్యోగి. వృత్తిరీత్యా వోడాఫోన్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అభిషేక్ కుమార్ నవంబర్ 15వ తేదీ రాత్రి కర్నూలు నుండి హైదరాబాద్ కు వచ్చి ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కాడు.

అప్పటికే ఆటోలో డ్రైవర్ తో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. గుట్కా కొనాలని చెప్పి సనత్ నగర్ రైల్వే స్టేషన్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి నిందితులు ఆటో డ్రైవర్ ఠాకూర్ సురేందర్ సింగ్ అలియాస్ సేరు, బిరాదర్ సంతోష్ అలియాస్ రాజు, 23 సంవత్సరాల షేక్ హుజైర్ బాబా అలియాస్ హుజైర్ బాధితుడిని కొట్టి,కత్తి చూపించి అతని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. తదనంతరం ఫోన్ పే పాస్వర్డ్ బాధితుడి దగ్గర నుండి తీసుకొని ఫోన్ పే ఖాతా నుండి రూ.1181, రూ.12,700 బదిలీ చేయించుకున్నారు. 

దోచుకున్న డబ్బులు చాలవని మళ్లీ బాధితుడిని బెదిరించి అతని స్నేహితుడు నుండి 200 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుండి పారిపోయారు.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు 48 గంటలలో రెండు బృందాలుగా విడిపోయి 18వ తేదీ ఉదయం 10 గంటలకు నిందితులను పట్టుకొని వారి నుండి మూడు మొబైల్ ఫోన్లు ఒక కత్తి, ఒక ఆటో రిక్షా స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.ఈ క్రమంలో రాత్రి వేళల్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు.