సంగారెడ్డి (హత్నూర), వెలుగు: పోలీసులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆటో డ్రైవర్ సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పటేల్ విఠల్ గౌడ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ తో సైడ్ తీసుకునే విషయమై గొడవపడ్డాడు. బస్సును ఓవర్టేక్ చేసి బస్ ముందు ఆటోను నిలిపి డ్రైవర్ ను కొట్టి దుర్భాషలాడాడు. బస్ డ్రైవర్ డయల్100కు ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు తిట్టి బెదిరించడంతో మనస్తాపం చెంది ఆటో డ్రైవర్ విఠల్ గౌడ్ పోలీస్ స్టేషన్ లోనే డీజిల్ పోసుకొని నిప్పంటించుకొని సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు బాధితుడు తెలిపాడు. ఈ విషయమై ఎస్ఐ సుభాష్ను వివరణ కోరగా, ఆర్టీసీ బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. విఠల్గౌడ్ ను బెదిరించలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్ కంప్లైంట్ ఇస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ పార్కింగ్ ప్లేస్ లో డీజిల్ పోసుకొని సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడించారు. కంప్లైంట్ చేస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ భయపడి ఉంటాడని పోలీసులు అతడిని బెదిరించలేదని ఎస్ఐ తెలిపారు.