- 16వ డివిజన్ కీర్తినగర్ బొడ్రాయి వద్ద ఘటన
- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
- ఐదు నెలల నుంచీ ఓపెనే...
- అధికారులకు చెప్పినా పట్టించుకోలే...
వరంగల్ సిటీ, వెలుగు: నడిరోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్హోల్నిండు ప్రాణాన్ని మింగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. కార్పొరేషన్ పరిధిలోని16వ డివిజన్ కీర్తి నగర్ బొడ్రాయి వద్ద తెరిచి ఉన్న మ్యాన్హోల్లో ఆటో పడడంతో ఇటుకల మల్లేశం (51) అనే ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. కుటుంబసభ్యులు, గీసుకొండ పోలీసుల కథనం ప్రకారం..ఏనుమాముల ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఇటుకల మల్లేశం (51) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆదివారం ఆటో కిరాయికి వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో కీర్తి నగర్ బొడ్రాయి వద్ద తెరిచి ఉన్న మ్యాన్ హోల్ ను గమనించలేదు. దీంతో ఆటో అందులో పడిపోవడంతో మల్లేశం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులుమల్లేశంను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్లేశానికి భార్య స్వరూప, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన మల్లేశ్మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడింది.
ఐదు నెలల నుంచీ ఓపెనే..
కీర్తినగర్ లో బొడ్రాయి వద్ద ఐదు నెలలుగా మిషన్ భగీరథ అధికారులు పైప్ లైన్ వేసి మ్యాన్ హోల్ పైకప్పు వేయలేదని స్థానిక ప్రజలు చెప్పారు. ఇదే విషయాన్ని ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. మ్యాన్హోల్తెరిచి ఉండడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని, అయినా పట్టించుకునే వారు లేరన్నారు.