ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్​ టీచర్

సోషల్​మీడియాలో వైరల్ అయ్యే మోటివేషనల్​ వీడియోలు, సక్సెస్​ స్టోరీలు మనసుని తాకుతాయి. బెంగళూరుకు చెందిన ఈ ఆటో డ్రైవర్​ స్టోరీ కూడా అలాంటిదే. ఈ పెద్దాయన స్టోరీ వైరల్ అవ్వడానికి కారణం... ఈయన ఇంగ్లీష్​​ చాలా చక్కగా మాట్లాడతాడు. ఒకప్పుడు ఇంగ్లీష్​ లెక్చరర్​గా పనిచేసిన ఈయన... ఇప్పుడు ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే..  
ఐదు రోజుల క్రితం ‘జంబోటెయిల్​’ అనే కంపెనీలో రీసెర్చర్​గా పనిచేస్తున్న నిఖిత అయ్యర్​  ఆఫీస్​కు వెళ్లడానికి ఒక ఆటోని ఆపింది.  దాదాపు  70 ఏండ్లు పైబడిన ఆ ఆటోడ్రైవర్​ ‘ఎక్కడికి వెళ్లాలమ్మా?’ అని ఆమెని ఇంగ్లీష్​లో అడిగాడు. ‘ఆఫీస్​కు వెళ్లాలి. టైం అయిపోతోంది’ అని ఆమె కూడా ఇంగ్లీష్​లో చెప్పింది. వెంటనే ఆ పెద్దాయన ‘ఓకే మేడమ్. ఆటో ఎక్కండి. మీరు ఇవ్వాలనుకున్నంత ఇవ్వండి’ అని ఇంగ్లీష్​లో చెప్పేసరికి ఆమె షాక్​ అయింది. అంత బాగా  ఇంగ్లీష్​ మాట్లాడుతున్న ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది ఆమెలో. ఆటో ఎక్కిన తర్వాత... ‘మీరు ఇంత బాగా ఇంగ్లీష్​ ఎలా మాట్లాడగలుగుతున్నారు?’ అని అడిగింది. ‘నేను ఇంగ్లీషులో ఎం.ఎ, ఎం.ఎడ్ కోర్స్ చేశాను’ అని చెప్పాడు.  నిఖిత ‘పెద్ద చదువు చదివిన మీరు ఆటో ఎందుకు నడుపుతున్నారు?’ అని ఆమె అడిగేలోపే ఆయన తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు.  
20 ఏండ్లు లెక్చర​ర్​గా చేసి...
‘‘నా పేరు పట్టాభి రామన్. లెక్చరర్​గా ఇక్కడ జాబ్ రాకపోవడంతో ముంబైకి వెళ్లాను. అక్కడ పొవాయ్​లోని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్​గా 20 ఏండ్లు పనిచేశాను. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ బెంగళూరు వచ్చాను.  ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్​గా పని చేస్తే నెలకు 10 వేల నుంచి 15 వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్లు. పైగా పెన్షన్ కూడా రాదు.  మాకు ఒక అబ్బాయి.  రిటైర్మెంట్ తర్వాత డబ్బుల కోసం కొడుకు మీద ఆధారపడడం ఇష్టంలేక ఆటో నడపాలి అనుకున్నా. ఆటో నడిపి రోజుకు 700 నుంచి 1500 రూపాయల వరకు సంపాదిస్తున్నా.  
14 ఏండ్లుగా ఆటో నడుపుతున్నా. నాకు, నా గాళ్​ఫ్రెండ్​(నా భార్య)కు ఆ డబ్బులు సరిపోతాయి. నా భార్యకు 72 ఏండ్లు. మా అబ్బాయితో కలిసి ఉండకుండా మేం ఇద్దరం కడుగోడిలో ఉంటున్నాం. అయితే, రూం కిరాయి నెలకి 12 వేలు మా అబ్బాయి ఇస్తాడు. మిగతా ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం. నేను రోజుకు పది గంటలు ఆటో నడుపుతా’’ అని నవ్వుతూ తన గురించి చెప్పాడు 74 ఏండ్ల పట్టాభి. 
ఆమె ఆఫీస్​కు వెళ్లడానికి పట్టిన 45 నిమిషాల్లో తన స్టోరీ చెప్పాడు. ఆ డ్రైవర్​ మోటివేషనల్ స్టోరీ అందరికి చెప్పాలని తన లింక్​డిన్​ ఎకౌంట్​లో  షేర్​ చేసింది నిఖిత. దాంతో ఆయన స్టోరీ ఇంటర్నెట్​లో వైరల్ అవుతోంది.  నాలుగు రోజుల క్రితం నిఖిత పోస్ట్ చేసిన ఈ స్టోరీని ఇప్పటికే 72 వేల మందికి పైగా లైక్​ చేశారు.