ఆటో నంబర్​లేదు..చెట్టు గుర్తే క్లూ 

ఆటో నంబర్​లేదు..చెట్టు గుర్తే క్లూ 
  • ఏడాదిన్నర పాపను ఎత్తుకెళ్లిన ఆటోడ్రైవర్​
  • కిడ్నాపర్​ను పట్టించిన చెట్టు స్టిక్కర్​
  • కరీంనగర్​లో ఘటన 
  •  ఆరు గంటల్లోనే ఛేదించిన పోలీసులు​

కరీంనగర్ క్రైం, వెలుగు :  కరీంనగర్‍లో ఏడాదిన్నర పాప కిడ్నాప్​ కాగా, పోలీసులు ఆరు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సీపీ వి.సత్యనారాయణ మంగళవారం వివరాలు తెలియజేశారు. నగరంలోని అశోక్‍నగర్​కు చెందిన మహమ్మద్‍ కుత్బుద్దీన్​(30) మటన్​అమ్ముతుంటాడు. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. సోమవారం రాత్రి 7గంటలకు ఇంటి ముందు ఆడుకుంటుండగా నగరంలోని సుభాష్‍నగర్‍కు చెందిన సంతోష్(32) కిడ్నాప్ చేశాడు. ఇతను మున్సిపాలిటీలో ప్రైవేటు డ్రైవర్ కాగా, ఖాళీ టైమ్ లో ఆటో నడిపిస్తుంటాడు. కిడ్నాప్​ చేసిన తర్వాత పాపను తన స్నేహితుడైన ఖాజీపూర్‍కు చెందిన  కొలమద్ది రాములు వద్ద ఉంచాడు. రెండు, మూడు రోజుల తర్వాత పాపను అమ్మాలని నిర్ణయించుకొని తిరిగి సుభాష్​నగర్​కు వచ్చాడు.   

ఆటో నంబర్​లేదు..చెట్టు గుర్తే క్లూ 

పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కొందరు స్థానికులు పాపను ఎవరో ఆటోలో తీసుకెళ్తుండగా చూసినట్టు చెప్పారు. దీంతో కరీంనగర్ వన్‍టౌన్‍ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే కిడ్నాప్​ జరిగిన చోట సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో స్థానికులు చెప్పిన ఆటోకు నంబర్​ లేకపోవడంతో నిరాశ పడ్డారు. అయితే ఆటో వెనక చెట్టు స్టిక్కర్ ఉండడంతో దాన్నే క్లూగా తీసుకుని ఇన్వెస్టిగేషన్​ స్పీడప్ ​చేశారు. టౌన్ లో ఉన్న అందరు ఆటో డ్రైవర్లకు ట్రీ స్టిక్కర్ ఉన్న ఆటో ఫొటో చూపించి అడిగారు.

చివరకు ఆ ఆటో సుభాష్ నగర్ ప్రాంతానికి చెందినదని తేలడంతో ఆగమేఘాల మీద సుభాష్​నగర్​ చేరుకున్నారు.  అప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారని తెలుసుకున్న సంతోష్​ ఆటో వెనక చెట్టు  స్టిక్కర్​ను తొలగించాడు. అయితే సీసీ ఫుటేజీలో ఆటోకు జెండా కట్టి ఉన్నట్టు కనిపించడం, నంబర్​ లేకపోవడం, ఇతర పోలికలు సరిపోవడంతో సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి సమాచారంతో ఖాజీపూర్‍కు వెళ్లి రాములును అదుపులోకి తీసుకొని పాపను రక్షించారు.

మంగళవారం తెల్లవారుజాము లోపే తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్‍ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఇన్​స్పెక్టర్లు సీహెచ్‍ నటేశ్, పి. దామోదర్‍రెడ్డి, ఎస్‍ఐలు ఎస్‍.శ్రీనివాస్‍, రహీంపాషా, టి.మహేశ్, ఇతర పోలీసులను సీపీ అభినందించారు.