ఆటోవాలా బతుకులు ఆగమాగం

పూటగడవక ఇబ్బందులు
సాయం కోసం ఎదురుచూపులు

మంచిర్యాల, వెలుగు: కరోనా లాక్ డౌన్ తో ఆటోవాలాలు ఆగమవుతున్నారు. గత పన్నెండు రోజులుగా ఆటోలు బంద్ కావడంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏ రోజుకారోజు వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషించుకునేవారే అధికం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది. ప్రస్తుతం తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 20 వేలకు పైగా ఆటోలున్నాయి. వీటిపై ఆధారపడి
30వేల మందికి పైగా ఆటోవాలాలు బతుకుతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారితో పాటు ఇంటర్, డిగ్రీ చదువుకున్న యువకులు సైతం ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తూ ఉపాధి పొందుతున్నారు. చాలా మంది ఫైనాన్స్ లో అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఆటోలు కొన్నారు. మరికొంత మంది ఆటోలు అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. వీరు రోజంతా కష్టపడితే ఐదారు వందలు వస్తాయి. ఓనర్ కమ్ డ్రైవరకు ఖర్చులు పోను మూడు నాలుగు వందలు మిగులుతాయి. డ్రైవరకు అయితే రెండు మూడు వందలే గిట్టుబాటు అవుతాయి. చాలా మంది అరకొర సంపాదనతో అతికష్టంగా తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక్కరోజు ఆటో బంద్ పెడితే పూట గవడని పరిస్థితి. తాజాగా కరోనా మహమ్మారి బడుగు జీవులను అతలాకుతలం చేసింది. గత నెల 21న కర్ఫ్యూ, 22 నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో ఆటోలకు బ్రేకులు పడ్డాయి. చేతిలో పైసల్లేక ఆటోవాలాలు పరేషాన్ అవుతున్నారు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. చాలామంది ఉపాధికోసం, పిల్లల చదువుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చారు. ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లులు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యం, రూ.1500 ఆర్థికసాయం ఇంతవరకు అందలేదు. చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో సర్కారు సాయానికి నోచుకోవడం లేదు. ఇప్పటికే దినదిన గండంగా బతుకుతున్నామని, లాక్ డౌన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

బియ్యం, పప్పులు ఉద్దెర
మాది కోటపల్లి మండలం సిర్స. ఊళ్లె కొంత భూమి ఉంటె అమ్ముకొని ఇరవై ఐదేండ్ల కింద ఇక్కడికి వచ్చినం. అప్పటినుంచి
ఆటో నడుపుతున్న. నెలంత కష్ట పడితే ఇంటి కిరాయిలు, పిల్ల చదువులకే సంపాదన సాల్తలేదు. ఇప్పుడు బియ్యం, పప్పులు
ఉద్దెర తెచ్చి తింటున్నం. మాలాంటోళ్లను సర్కారు ఆదుకోవాలె. – జొన్నల లక్ష్మణ్, నస్పూర్

తిండికి తిప్పలయితంది..
నేను పదిహేనేళ్ల నుంచి ఆటో నడుపుతున్న. ఏడాది కింద ఫైనాన్స్ల లో ఆటో కొన్న. నెలకు మూడు వేలు కిస్తీ కట్టాలె. గిరాకీ మంచిగుంటే
ఖర్చులు పోను రోజుకు రెండు మూడు వందలు మిగుల్తయి. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నరు. ఆటోలు నడవక తిండికి తిప్పలయితుంది. అప్పులు చేసి నెట్టుకొస్తున్న. – గడికొప్పుల మల్లేశ్, శ్రీరాంపూర

For More News..

ప్రమోట్ చేద్దామా.. పరీక్షలు పెడదామా?

ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టి వేత