ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వానరానికి ఆటో డ్రైవర్లు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాపురంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే... జిల్లలోని చింతకాని మండలం తిరుమలాపురం క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వానరం అక్కడికక్కడే చనిపోయింది. అక్కడే ఉన్న మిగతా వానరాలు చనిపోయిన వానరం చుట్టూ గుంపులుగా చేరాయి. అప్పుడు ఖమ్మం నుంచి అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ కోతుల గుంపు వద్ద ఆగి విషయం ఏంటో గమనించాడు.
వెంటనే చనిపోయిన వానరాన్ని ఆటోలో ఎక్కించుకొని నాగులవంచ గ్రామం చేరుకున్నాడు. అనంతరం ఆటో యూనియన్ సభ్యులు, గ్రామస్థులకు చెప్పాడు. వారంతా వానరానికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వానరాన్ని ఆటోలో ఉంచి డప్ప వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. కొంతమంది మహిళలు పసుపు, కుంకుమ, పూలు చల్లి వానరానికి పూజలు చేశారు. చివరికి గ్రామస్తులంతా కలిసి వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనంతటికి కారణమైన ఆటో యూనియన్ సభ్యులను గ్రామస్థులు అభినందించారు.