కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారు.. కానీ వేలాది కుటుంబాలు నష్టపోతున్నాయని వాపోతున్నారు. కాబట్టి ఈ పథకం గురించి పునరాలోచన చేయాలి.. లేకపోతే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని వేడుకుంటున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆటో డ్రైవర్లు ధర్న చేపట్టారు. నిజాంపేట,రామాయంపేట మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. ఫ్రీ బస్సుల వల్ల తము ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. ఈ స్కీమ్ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆటోల ఈఎమ్ఐ లు కట్టలేని స్థితిలో ఉన్నామని ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేశారు.
అటు జగిత్యాల జిల్లాలో ఫ్రీ బస్సుల వల్ల తమ ఉపాధిని కోల్పోయామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కొడిమ్యాల, రాయికల్ మండలాల్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. గ్రామంలో ర్యాలీగా వెళ్లిన ఆటో యూనియన్ కార్మికులు.. తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
మరోవైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆటో డ్రైవర్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్పి క్యాంపు నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తమకు ప్రభుత్వం నెలకు పదిహెను వేలు జీవన బృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.