మహిళలకు ఉచిత బస్సు రవాణా రద్దు చేయాలి.. ఆటో కార్మికుల భారీ నిరసన ర్యాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ వ్యతిరేకంగా సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ఆటోలతో ర్యాలీ నిర్వహించి.. నిరసన తెలిపారు. 

మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వెంటనే రద్దు చేయాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో యూనియన్ నాయకులు నినాదాలు చేశారు. లేకుంటే.. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని.. ప్రతి నెల ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇవ్వాలని.. రూ.5 లక్షల జీవిత బీమా  కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లపై ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కారించాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్ల యూనియన్లు హెచ్చరించారు.