శ్రీవారి మెట్టు మార్గం టైంస్లాట్​ టోకెన్ల దందా.. భక్తులను దోచుకుంటున్న ఆటోవాలాలు

శ్రీవారి మెట్టు మార్గం టైంస్లాట్​ టోకెన్ల దందా.. భక్తులను దోచుకుంటున్న ఆటోవాలాలు

తిరుమల శ్రీవారి కొలువైన కొండ కింద కొత్త దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు. దర్శనం టికెట్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇక సెలవు రోజులు.. శని, ఆదివారాల్లో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసి పోతుంది. భక్తులు స్వామి దర్శనం టైం స్లాట్​ టిక్కెట్ల కోసం వేచి  ఉంటారు.  

బస్సులు, రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులు ప్రైవేట్​ వాహనాలు... ఆటోలు.. ట్యాక్సీల్లో  శ్రీవారి మెట్టుకు చేరుకుంటారు.  అక్కడ కొంతమంది ఆటోవాలాలు  టైం స్లాట్​ టికెట్లు ఇస్లామని భారీగా డబ్బులు దండుకుంటున్నారు.  ఒక్కో ఆటోడ్రైవర్ 5-7 మంది భక్తుల బృందం నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.  టీటీడీ అధికారులు  ఆటోలను మాత్రమే పంపుతున్నారని టీటీడీ సెక్యూరిటీతో భక్తుల వాగ్వాదానికి దిగారు.  
శ్రీవారి భక్తులు  పంప్ హౌస్ వద్ద బారికేడ్లు.. సెక్యూరిటీని తోసుకొని వెళ్లారు. 

తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా  చర్చనీయాంశంగా మారింది. అక్కడ టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిమెట్టు దగ్గర భక్తులకు అర కొర టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ. ఇక్కడే దళారుల దందా మొదలవుతుంది అని భక్తులు ఆరోపిస్తున్నారు. 

కొందరు ఆటో డ్రైవర్లు.. తాము తీసుకువస్తున్న భక్తులకు.. నిర్ణీత సమయం దాటినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్నవారిని కాదని దొడ్డిదారిన ఆటోవాలాలతో డీల్‌ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్‌ చేయడంలోనూ, క్యూలైన్‌లలోని ఏర్పాట్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.