ఎండ, వానతో సంబంధం లేదు. రాత్రి, పగలు తేడాలు లేవు. సాయం అంటూ ఏ గర్భిణి ఇంటి నుంచి ఫోన్ వచ్చినా పరుగున వెళ్తాడు సాహెబ్రావు. తన ఆటోలో హాస్పిటల్‌కి తీసుకెళ్లి, మళ్లీ క్షేమంగా ఇంట్లో దిగబెడతాడు. ఆడపిల్ల పుడితే ఆరునెలల దాకా తల్లీబిడ్డల్ని చెకప్‌కి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాడు. అది కూడా ఫ్రీగా. గొప్ప మనసున్న ఇతని గురించి...
నిర్మల్ జిల్లా భైంసాలోని పిప్రీ కాలనీలో ఉంటాడు కాంబ్లే సాహెబ్రావు. తాపీ పని చేసే వాళ్ల నాన్న రాందాస్ వయసు మీద పడటంతో కొన్నేండ్ల నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. దాంతో తల్లి నాగమణి బీడీలు చుడుతూ సాహెబ్రావుతో పాటు, మిగితా ఇద్దరు పిల్లల బాధ్యతని భుజానికెత్తుకుంది. కానీ, రానురాను ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఇంటర్‌తోనే చదువు ఆపేశాడు సాహెబ్. తల్లికి చేదోడుగా ఉండాలని ఆటో నడపడం మొదలుపెట్టాడు. కానీ, తన ఫ్రెండ్ కూతురుకి ఎదురైన ఓ సమస్య అతన్ని ఆలోచింపజేసింది. గర్భిణీల కోసం ఫ్రీ ఆటో సర్వీస్ మొదలుపెట్టించింది.
ఏడాది కిందట సాహెబ్ ఫ్రెండ్‌కి కూతురు పుట్టింది. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు వాళ్లకి. పుట్టిన కొద్దిరోజులకే పాప ఆరోగ్యం బాగా పాడైంది. హాస్పిటల్‌కి వెళ్లడం ఆలస్యం కావడంతో ఆ చిన్నారి చనిపోయింది. ఆ సంఘటన తర్వాత చాలా రోజులు నిద్రపట్టలేదు సాహెబ్‌కి. అప్పుడే ఆ పాప పరిస్థితి మరొకరికి రాకూడదు అనుకున్నాడు. బాలింతలతో పాటు గర్భిణీలను టైంకి హాస్పిటల్‌కి చేర్చడానికి ఫ్రీ ఆటో సర్వీస్ మొదలుపెట్టాడు. సాయం కావాలని ఎన్ని మైళ్ల దూరం నుంచి ఫోన్ వచ్చినా రాత్రిపగలు, వారాలతో పనిలేకుండా వెళ్తున్నాడు. వాళ్లని హాస్పిటల్‌కి చేర్చడమే కాదు.. ట్రీట్మెంట్ పూర్తయ్యాక మళ్లీ తన ఆటోలోనే ఇంట్లో దిగబెడుతున్నాడు. ఆడపిల్ల పుడితే పుట్టిన తేదీ నుంచి ఆరు నెలల వరకు ఫ్రీగా తన ఆటోలోనే చెకప్‌కి తీసుకెళ్తున్నాడు.ఇలా గడిచిన ఎనిమిది నెలల నుంచి వందల మందికి సాయం చేశాడు సాహెబ్. ఈ పనిలో అతని కుటుంబం కూడా అండగా నిలుస్తోంది.
‘‘నా ఫ్రెండ్ కూతురు చనిపోయాక..చాలా రోజులు ఆ ఇన్సిడెంట్ నుంచి తేరుకోలేకపోయా. కానీ, అలా బాధపడుతూ కూర్చోవడం కంటే.. ఆ బాధ మరొకరికి ఎదురుకాకుండా నా వంతుగా ఏదైనా చేయాలనుకున్నా. అలా మొదలుపెట్టా ఈ ఫ్రీ ఆటో సర్వీస్. ‘పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లలో ఇదంతా ఎందుకు?’ అని అడుగుతుంటారు కొందరు. కానీ, టైంకి హాస్పిటల్‌కి చేర్చాక తల్లుల ముఖంలో కన్పించే ధైర్యం, అప్పుడే పుట్టిన బిడ్డల నవ్వులు చూశాక జీవితంలో డబ్బు చాలా చిన్న విషయం అనిపిస్తుంది. చనిపోయిన నా ఫ్రెండ్ కూతురు వాళ్లందరిలోనూ కనిపిస్తుంది. రానున్న రోజుల్లోనూ ఈ ఫ్రీ సర్వీస్‌ని కంటిన్యూ చేస్తా’’ అంటున్నాడు సాహెబ్