వర్ని, వెలుగు : రంజాన్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కోసం వెళ్తుండగా ఆటో బోల్తా పడడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాన్సువాడ మండల కేంద్రంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన మొయిన్ (38) తన కుటుంబ సభ్యులు జుబేర్, సుల్తానా, ఆలియా, అహ్మది (52), అమ్మీన్, అయాన్, అహిల్, అనాబియాతో కలిసి ఆదివారం రాత్రి ఆటోలో బడాపహాడ్ బయలుదేరాడు.
ఈ క్రమంలో హన్మాజీపేట్ దాటగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొయిన్‌తో పాటు అతడి అత్త అహ్మది స్పాట్‌లోనే చనిపోగా మిగతా వారికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి కారణాలు తెలుసుకున్నారు.