డిసెంబర్​7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్

డిసెంబర్​7న  రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమైందని అందుకు నిరసనగా డిసెంబర్​7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోబంద్​నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్స్​యూనియన్​ జేఏసీ ప్రకటించింది. ఆటోడ్రైవర్ల సమస్యలపై గురువారం బషీర్​బాగ్​ప్రెస్​క్లబ్​లో జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ ఆటో డ్రైవర్స్​యూనియన్​ జేఏసీ నేతలు బి. వెంకటేశం (ఎఐటీయూసీ), పి.శ్రీకాంత్​(సీఐటీయూసీ), ప్రవీణ్​ (టీయూసీఐ), ఎంఎ సలీమ్​(యూటీఏడీడబ్ల్యూఏ), ఎ.సత్తిరెడ్డి(టీఏడీఎస్​), వి.మారయ్య (బీఆర్ టీయూ)తోపాటు బీఆర్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్​, ఏఐటీయూసీ సీనియర్​నేతలు విఎస్​బోస్​ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వివిధ సంఘాల నేతలు​మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. 10 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.