- పెరిగిన మారుతి, టాటా మోటార్స్, టయోటా సేల్స్
- 20 శాతం తగ్గిన హ్యుందాయ్ ఎగుమతులు
- గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్నసేల్స్.. కలిసొచ్చిన వెడ్డింగ్ సీజన్
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు నవంబర్‌లో పుంజుకున్నాయి. వెడ్డింగ్ సీజన్ కావడంతో ప్యాసింజర్ బండ్లకు డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా ఎస్‌యూవీల సేల్స్ పెరిగాయి. మారుతి సుజుకీ ఈ ఏడాది నవంబర్‌లో 1,41,312 బండ్లను విక్రయించింది. కిందటేడాది ఇదే టైమ్‌లో జరిపిన అమ్మకాలు 1,34,158 యూనిట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి సాధించింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ బాగుందని, రూరల్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయని, లిమిటెడ్ ఎడిషన్ కార్లతో కస్టమర్లను ఆకర్షించగలిగామని మారుతి సుజుకీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ వివరించారు. మొత్తం బండ్లలో 48.7 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే అమ్మగలిగామని పేర్కొన్నారు.
కానీ, పట్టణాల్లో మాత్రం గ్రామాల్లో కనిపించినంత డిమాండ్ నవంబర్‌లో లేదని అన్నారు. ‘ పట్టణాల్లో అక్టోబర్‌లో కనిపించినంత డిమాండ్ నవంబర్‌లో కనిపించలేదు. సాధారణంగా పట్టణవాసులు నవంబర్‌లో కొనుగోళ్లు తగ్గించుకొని, డిసెంబర్ కోసం వెయిట్ చేస్తుంటారు’ అని బెనర్జీ వివరించారు. తమ సేల్స్‌లో 29 శాతం వాటా ఎస్‌యూవీల నుంచి ఉందన్నారు. కాగా, మారుతి సుజుకీ బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6 వంటి 59,003 యుటిలిటీ వెహికల్స్‌ను కిందటి నెలలో అమ్మగలిగింది. కిందటేడాది నవంబర్‌లో ఈ నెంబర్ 49,016 యూనిట్లుగా ఉంది. కానీ, కంపెనీకి చెందిన మినీ సెగ్మెంట్ కార్లు ఆల్టో, ఎస్ప్రెస్సో సేల్స్ మాత్రం 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. బాలెనో, సెలెరియా, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 64,679 బండ్ల నుంచి 61,373 బండ్లకు తగ్గాయి.
టయోటా అమ్మకాలు 44 శాతం అప్
మరో పెద్ద కంపెనీ టాటా మోటార్స్ సేల్స్ కూడా నవంబర్‌లో పెరిగాయి. 2023 నవంబర్‌లో 46,068 కార్లను అమ్మిన ఈ కంపెనీ , కిందటి నెలలో 47,063 కార్లను అమ్మింది. ఇది 2 శాతం గ్రోత్‌కు సమానం. వీటిలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా ఉన్నాయి. టాటా మోటార్స్‌కు చెందిన కమర్షియల్ వెహికల్ సేల్స్ ఇందులో కలిసి లేవు. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు ఏకంగా 44 శాతం పెరిగి 17,818 బండ్ల నుంచి 25,586 బండ్లకు చేరుకున్నాయి. మరోవైపు కార్ల మార్కెట్లో సెకెండ్ పొజిషన్లో ఉన్న హ్యుందాయ్ సేల్స్ మాత్రం నవంబర్‌లో రెండు శాతం తగ్గాయి. కిందటేడాది నవంబర్‌లో 49,451 కార్లను అమ్మిన ఈ కంపెనీ, ఈ ఏడాది నవంబర్‌లో 48,246 కార్లను అమ్మింది.
కంపెనీ ఎగుమతులు అయితే ఏకంగా 20 శాతం పడి నవంబర్‌లో 13,006 యూనిట్లుగా రికార్డయ్యాయి. రూరల్ ఏరియాల్లో మరింతగా విస్తరించామని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ అమ్మిన మొత్తం బండ్లలో ఎస్‌యూవీల వాటా 68.8 శాతానికి చేరుకుందని కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ అమ్మకాలు నవంబర్‌లో 20 శాతం పెరిగి 6,019 యూనిట్లకు చేరుకున్నాయి. తాజాగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు విండ్సోర్కు డిమాండ్ బాగుందని, వరుసగా రెండో నెలలోనూ 3,144 కార్లు అమ్ముడయ్యాయని ఈ కంపెనీ తెలిపింది.