పవర్​ షెడ్యూల్ ​ప్రకటించకుండా ఆటో స్టార్టర్లు ఎత్తుకపోతున్రు

  • విద్యుత్​ మంత్రి  చెప్పినా ఆగని కరెంట్​ కోతలు
  •     రాత్రి పూట కరెంట్​తో పురుగు, పుట్ర భయం  
  •     ఆటో స్టార్టర్లపైనే ఆధారపడుతున్న రైతులు
  •     బలవంతంగా తొలగించడంపై ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం​, వెలుగు: వ్యవసాయానికి వేళాపాలా లేకుండా కరెంట్​ కోతలు విధిస్తున్న ట్రాన్స్​కో ఆఫీసర్లు బావులు, బోర్ల దగ్గరి ఆటోస్టార్టర్లను బలవంతంగా లాక్కెళ్లడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందు కరెంట్​ కోతల షెడ్యూల్​ ప్రకటించి, ఆ తర్వాతే స్టార్టర్ల జోలికి రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్​ సిబ్బందికి, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.  

24 గంటల కరెంట్​ వస్తలే.. 

వ్యవసాయానికి 24 గంటల కరెంట్​ ఫ్రీగా ఇస్తున్నామని,  కనురెప్పపాటు  కూడా కరెంట్ పోవట్లేదని  ఓ వైపు ప్రభుత్వం చెస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు.  పగటి పూట కరెంట్​ కోతల కారణంగా  పంట పొలాలు ఎండిపోతుండడంతో రెండు, మూడువారాలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10న విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, డిమాండ్​ఎక్కువగా ఉండడంతో  వ్యవసాయ విద్యుత్ కోతలు తప్పలేదని,  కానీ ఎప్పట్లాగే  24 గంటల కరెంట్​పునరుద్ధరించామని ప్రకటించారు. మంత్రి ప్రకటన తర్వాత కూడా జిల్లాల్లో ఎక్కడా 24 గంటల కరెంట్​ ఇవ్వడం లేదు. రాత్రి , పగలు కలిపి కనీసం 5 నుంచి 6 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. ఎక్కడా షెడ్యూల్​ అమలుకావడం లేదు.  పగటితో పోలిస్తే రాత్రి పూట పూర్తిస్థాయిలో కరెంట్ ఉంటున్నా పురుగు, పుట్ర భయంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ఇలాంటి రైతులు ఆటోమేటిక్​ స్టార్టర్లను నమ్ముకున్నారు. ఇవి కరెంట్​ వచ్చినప్పుడు స్టార్ట్​అయ్యి, కరెంట్ ​పోయాక బంద్ ​అవుతుండడంతో పొలాలను పారించుకుంటున్నారు.

ఆటో స్టార్టర్లను తొలగిస్తున్న సిబ్బంది.. 

ఆటో స్టార్టర్ల కారణంగా ట్రాన్స్​ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి, కాలిపోతున్నాయని, అవసరం లేకున్నా మోటర్లు నడవడం వల్ల సమస్యలు వస్తున్నాయని ట్రాన్స్ కో ఆఫీసర్లు అంటున్నారు. అందువల్ల వీటిని వెంటనే తొలగించాలని పై నుంచి సిబ్బందికి ఆదేశాలు అందాయి. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన ట్రాన్స్​కో సిబ్బంది ఆటో స్టార్టర్లు తొలగించాలని, వాటి స్థానంలో కెపాసిటర్లు పెట్టుకోవాలని రైతులను ఆదేశిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో తొలగించుకోకపోతే తామే తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాన్స్​కో ఆఫీసర్లు మరో అడుగు ముందుకేసి రైతులకు సమాచారం లేకుండానే ఆటో స్టార్టర్లను  తీసుకెళ్తున్నారు. సుజాతనగర్ మండలంలో ఇప్పటి వరకు  200  ఆటో స్టార్టర్లు, అశ్వారావుపేట మండలంలో1200కు పైగా ఆటో స్టార్టర్లను తొలగించారు. దీంతో ఆయాచోట్ల రైతులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరుగుతోంది.  ముందుగా కోతల షెడ్యూల్ ​ప్రకటించాలని, ఆ తర్వాతే ఆటోస్టార్టర్లను తొలగిస్తామని రైతులు అంటున్నారు.  

 ఆటో స్టార్టర్లను తొలగిస్తున్నరు 

నేను 30 ఎకరాలు సాగు చేస్తున్నా. బోరే ఆధారం. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు త్రీ ఫేస్ కరెంట్ ఇస్తున్నారు. కానీ మధ్య మధ్యలో కరెంట్ పోతుంది. దీంతో మోటార్ ఆఫ్ అయిపోతోంది. ఎప్పుడు వస్తుందో , ఎప్పుడు పోతుందో తెలియక  మోటార్లకు ఆటో స్టాటర్లు బిగించుకున్నం. ఇప్పుడు లైన్ మెన్ వచ్చి వాటిని తొలగిస్తున్నారు. ముందు షెడ్యూల్​ ప్రకటించాకే ఆటో స్టార్టర్లను తొలగిస్తాం. లేదంటే పంటలు ఎండిపోతాయి. - మల్లెల రవీందర్రెడ్డి, రైతు, వేపలగడ్డ గ్రామం, సుజాతనగర్ మండలం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా