కూకట్ పల్లిలో ఆటో ట్రాలీ బీభత్సం: మందు కొట్టి కార్లు, బైక్స్ ని ఢీకొట్టిన డ్రైవర్

కూకట్ పల్లిలో ఆటో ట్రాలీ బీభత్సం: మందు కొట్టి కార్లు, బైక్స్ ని ఢీకొట్టిన డ్రైవర్

హైదరాబాద్: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కూకట్‎పల్లి వివేకానంద నగర్ జాతీయ రహదారిపై ట్రాలీ ఆటో బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ముందున్న రెండు కార్లు, ఓ బైకును ఢీకొట్టాడు ఆటో డ్రైవర్. ఈ ఘటనలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన వాహనదారులు.. ఆగ్రహానికి గురై డ్రైవర్‎ను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్‎ను అదుపులోకి తీసుకున్నారు.

ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. జాతీయ రహదారిపై ఆటో బీభత్సం సృష్టించడంతో కూకట్‎పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అసలే ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే టైమ్ కావడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ట్రాఫిక్‎లో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

►ALSO READ | ఆర్మీకోసం విరాళాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు..తెలంగాణ పోలీస్ కీలక ప్రకటన