వారెవా, చిక్కింది ఫేసు!

నేరస్తులు ఇక మరిన్నాళ్లు తప్పించుకోలేరు. వాళ్లు ఎక్కడ దాక్కోవటానికి వెళ్లినా పోలీసులకు పట్టిచ్చే పరికరాలు త్వరలో రానున్నాయి. అవే.. ఆటోమేటెడ్​ ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్​. వాటినే షార్ట్​ కట్​లో ఏఎఫ్​ఆర్​ఎస్​ అంటారు. వీటి సాయంతో నేరాలకు చెక్​ పెట్టాలని సర్కారు భావిస్తోంది. వీటిని ముందుగా ఎయిర్​పోర్టుల్లో  ఇన్​స్టాల్​ చేస్తారు. తర్వాత రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో అమర్చాలనే ప్రపోజల్​ కూడా ఉంది.

ఈ రోజుల్లో నేరాలు చేసి దొరక్కుండా తిరుగుతున్నోళ్లు ఎంత మందో. ఆచూకీ లేకుండాపోతున్న చిన్నారుల సంఖ్య కూడా ఈమధ్య బాగా పెరిగిపోతోంది. ఇక, తప్పిపోతున్న వ్యక్తులు, గుర్తు తెలియని డెడ్​బాడీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి వార్తలు రోజూ మీడియాలో లెక్కలేనన్ని వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని, దీనికంటూ ప్రత్యేకంగా ఒక బలమైన వ్యవస్థ ఉండాలని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయానికి వచ్చింది.  కళ్లు, ముక్కు, గడ్డం.. ఇలా మొహంలోని ఏ భాగం ఆధారంగానైనా నేరస్తులను గుర్తించే ఆటోమేటెడ్​ ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్​ (ఏఎఫ్​ఆర్​ఎస్​) ఏర్పాటుకు సెంట్రల్​ గవర్నమెంట్​ చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్​లోని శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో ఫేస్​ రికగ్నిషన్​ ట్రయల్స్​ మొదలయ్యాయి. వీఐపీలు చాలా మంది ఇక్కడ తమ వివరాలను నమోదు చేయించుకుంటున్నారు.

కాగా ఈ పరికరాలను తెప్పించుకోవాల్సిన బాధ్యతను కేంద్రం నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో(ఎన్​సీఆర్​బీ)కి అప్పగించింది. దీంతో ఎన్​​సీఆర్​బీ రంగంలోకి దిగింది. ఈ యంత్రాలను తయారుచేసి అందించే సంస్థల కోసం సెర్చింగ్​ మొదలు పెట్టింది. ఆయా కంపెనీలు నెల రోజుల్లోపు (ఆగస్టు 16 లోపు) వేలం పాటలో (బిడ్డింగ్​లో) పాల్గొనాలని కోరింది. బిడ్​లను అదే నెల 19న తెరిచి, ఒక సంస్థను సెలెక్ట్​ చేస్తామని, ఆ కంపెనీకే ప్రాజెక్టును అప్పగిస్తామని తెలిపింది. ఈ మేరకు తన వెబ్​సైట్​లో ‘రిక్వెస్ట్​ ఫర్​ ప్రపోజల్’(ఆర్​ఎఫ్​పీ) డాక్యుమెంట్​ను పెట్టింది. వేలం పాటలో నెగ్గిన సంస్థ ఆటోమేటెడ్​ ఫేసియల్​ రికగ్నిషన్​ సిస్టమ్స్​ను పక్కాగా రూపొందించాల్సి ఉంటుంది.

ఇదొక యాప్​

‘ఏఎఫ్​ఆర్​ఎస్’​ అనేది ఒక వెబ్​ బేస్డ్​ అప్లికేషన్. దీన్ని ఢిల్లీలోని ఎన్​సీఆర్​బీ డేటా సెంటర్​లో ఉంచి, ‘క్రైమ్​ అండ్​ క్రిమినల్​ ట్రాకింగ్ నెట్​వర్క్​ అండ్​ సిస్టమ్స్​’(సీసీటీఎన్​ఎస్​)తో దేశవ్యాప్తంగా పోలీస్​ స్టేషన్లకు కనెక్ట్​ చేస్తారు. ఏఎఫ్​ఆర్​ఎస్​ సొల్యూషన్.. లాజికల్​ ఆల్గారిథమ్స్​తోపాటు యూజర్​ ఫ్రెండ్లీ, సింపుల్​ గ్రాఫికల్​ యూజర్​ ఇంటర్​ఫేస్​ వంటి సేవలను అందిస్తుంది. తద్వారా సరిపోలిన మొహాలను​ గుర్తించటం తేలికవుతుంది. ఫేస్​ ఇమేజ్​లను సీసీటీవీ ఫుటేజ్​ల నుంచి సేకరిస్తారు. భారీ సంఖ్యలో ఉండే ఫొటోలను, వీడియోలను బల్క్​గా అప్​లోడ్​ చేసే ఆప్షన్ ఈ అప్లికేషన్​లో ఉంటుంది. ఎన్​సీఆర్​బీ డేటాబేస్​లో గతంలోనే రిజిస్టర్​ చేసిన ఫేస్​లకు ఏ ఇమేజ్​లైనా మ్యాచ్​ అయితే ఏఎఫ్​ఆర్​ఎస్​ వెంటనే అలర్ట్​ చేస్తుంది. దీంతో నేరస్తులను నిమిషాల్లో పట్టుకోవచ్చు.

క్షణాల్లో స్కానింగ్​

పాస్​పోర్టులు, జైళ్లలో కలెక్ట్​ చేసే క్రిమినల్స్​ ఫొటోలు, సీసీటీఎన్​ఎస్ ద్వారా సేకరించే స్నాప్​లు; స్టేట్​, నేషనల్​ ఆటోమేటెడ్​ ఫింగర్​ప్రింట్​ ఐడెంటిఫికేషన్ సిస్టమ్​ నుంచి తెప్పించుకునే ఇమేజ్​లు; పోలీసులు లేదా ఇతర ప్రభుత్వ విభాగాలు ఇచ్చే ఫొటో గుర్తింపు కార్డుల ఆధారంగా ఎన్​సీఆర్​బీ వద్ద డేటాబేస్​ భారీగానే ఉంటుంది. ఎన్​సీఆర్​బీ దగ్గర పెద్దమొత్తంలో ఉన్న ఆ డేటాబేస్​ని ఏఎఫ్​ఆర్​ఎస్​ క్షణాల్లోనే మ్యాచింగ్ చేయగలదు.

ఫలితంగా అనుమానితులను, క్రిమినల్స్​ను ఈజీగా అదుపులోకి తీసుకోవచ్చు. వ్యక్తుల మొహాల్లోని ఎక్స్​ప్రెషన్స్​, ఫేస్​ డైరెక్షన్​, యాంగిల్​, లైటింగ్, వ్యక్తుల వయసు, హెయిర్​స్టైల్​, కళ్లద్దాలు, ముఖంపై మచ్చలు, పుట్టు మచ్చలు, ఇతర గుర్తులు ఏవి ఉన్నా ఏఎఫ్​ఆర్​ఎస్​ ఇట్టే స్కాన్​ చేస్తుందని ఎన్​సీఆర్​బీ అంటోంది. ఈ పరికరాల​ సాయంతో క్రైమ్​ ఇన్వెస్టిగేషన్,​ అనాలసిస్​ వేగంగా పూర్తవుతుందని వివరిస్తోంది.

ఫోన్​లోనూ వాడొచ్చు

ఏఎఫ్​ఆర్​ఎస్​ యాప్​ ఉన్న మొబైల్​ను చేతిలో పట్టుకొని అలా బయటకు వెళ్లి పది మందిని కెమెరాలో బంధిస్తే చాలు. వాళ్లల్లో నేరస్తులు ఎవరో, అనుమానితులు ఎవరో తెలుసుకోవచ్చు. ఫోన్​లో ఉండే బ్యాకెండ్ సర్వర్​లోని డేటా.. మ్యాచింగ్​ రిజల్ట్​ని వెంటనే ఇస్తుంది. దీంతో ఆ వ్యక్తి కదలికలను పరిశీలించి సమాచారాన్ని పోలీస్​ స్టేషన్లకు పంపుతారు. క్రిమినల్స్​ సెర్చింగ్​, మ్యాచింగ్​, ఫేసియల్​ ఇమేజ్​ల వెరిఫికేషన్​కు సంబంధిత పోలీసులే అనుమతి ఇస్తారు. ఏఎఫ్​ఆర్​ఎస్​ మంచి ఫలితాలను ఇస్తుందని ఎన్​సీఆర్​బీ చెబుతోంది.

అమెరికాలో కొన్ని చోట్ల బ్యాన్

సిటీ పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఫేసియల్​ రికగ్నిషన్​ని వాడటాన్ని అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో ఈ ఏడాది మొదట్లోనే బ్యాన్​ చేశారు. ఆ దేశంలో తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్న సిటీ అదే. తర్వాత చాలా నగరాలు ఈ బాటలో నడుస్తున్నాయి. ఈ టెక్నాలజీని వినియోగించటంపై లిమిటెడ్​గా నిషేధం విధించాలని కాలిఫోర్నియా రాష్ట్రం భావిస్తోంది. సోమర్​విల్లే సిటీ గతవారమే ఆర్డర్​ పాస్​ చేసింది. ఓక్లాండ్​ సిటీ కూడా ఈ నెలాఖరు లోపు బ్యాన్​ చేయనుంది. బెర్క్​లీ నగరమూ ఈ దిశగానే దీర్ఘాలోచన చేస్తోంది.