మెరుగైన సేవల కోసమే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్

మెరుగైన సేవల కోసమే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్
  • హైలెవల్ కమిటీ సిఫార్సు మేరకే అమలు: టీజీఎస్ ఆర్టీసీ
  • ఈ విధానంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు
  • నిబంధనలకు అనుగుణంగానే ముందుకెళ్తున్నామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: టీజీఎస్ ఆర్టీసీలో ఆటో మేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్​సీఎస్) అమలు విషయంలో వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని సంస్థ ప్రకటించింది. హైలెవల్ కమిటీ సిఫార్సు మేరకు బోర్డు అనుమతితోనే ఈ సిస్టమ్​ను అమలు చేస్తున్నామని ప్రకటనలో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సంస్థ వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేసింది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆటో మేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్​ను అమలు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజ్​మెంట్ 2022లోనే నిర్ణయించిందని పేర్కొన్నది. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్​ల సౌకర్యం కల్పిస్తూ.. సేవలను మరింత సులభతరం చేయడమే ఏఎఫ్ సీఎస్ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఈ వ్యవస్థతో రియల్ టైమ్ సమాచారం ఎప్పటికప్పుడు సంస్థకు తెలుస్తుందని పేర్కొన్నది. ఈ సమాచారంతో ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులును ఏర్పాటు చేసుకోవచ్చని, ఇప్పుడున్న టికెట్ వ్యవస్థ కంటే ఎంతో మెరుగైందని యాజమాన్యం పేర్కొన్నది. 

ముగుస్తున్న సర్వీస్ ప్రొవైడర్ గడువు

డిజిటల్ టికెటింగ్ కు సంబంధించిన టెండర్ ప్రకటనను -2022, నవంబర్ 2న టీజీఎస్ ఆర్టీసీ మేనేజ్​మెంట్ రిలీజ్ చేసింది. అప్పుడు ఈ టెండర్ ప్రక్రియలో ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. టెండర్ లో ఇంటెలిజెంట్ టికెటింగ్ మిషన్ల సప్లై, డిజిటల్ టికెటింగ్, సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్, రోజువారీ నిర్వహణకు కావాల్సిన సర్వర్లు, సాంకేతికత, మ్యాన్ పవర్, తదితర సర్వీసులు ఉన్నాయి. ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ గడువు ముగుస్తుండటంతో.. ఆన్ లైన్ రిజర్వేషన్ తో పాటు డిజిటల్ టికెటింగ్ సౌకర్యం ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గరుంటే నిర్వహణ సులువుగా ఉంటుందని యాజమాన్యం భావించింది. అదే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ.. ప్రజా రవాణా వ్యవస్థలో సాంకేతికత అమలుకు రూ.20.97 కోట్లు నిధులను సంస్థకు మంజూరు చేసింది. ఆ నిధులతో ఐటిమ్స్ ను సొంతంగా కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. దీంతో 2023, జులై 3న టెండర్లను రద్దు చేసింది.

కంపెనీలకు సామర్థ్యం లేకపోవడంతో టెండర్లు రద్దు

ఏఎఫ్‌‌‌‌సీఎస్‌‌‌‌ ను వీలైనంత త్వరగా అమలు చేయాలనే ఉద్దేశంతో మరో టెండర్ ప్రకటనను ఈ ఏడాది జనవరి 11న సంస్థ విడుదల చేసింది. డిజిటల్ టికెటింగ్ సాఫ్ట్​వేర్​తో పాటు ఆన్ లైన్ రిజర్వేషన్ ను కలిపి.. ఐటిమ్స్ కొనుగోలు, సాఫ్ట్​వేర్ డెవలప్​మెంట్, నిర్వహణ అంశాలను వేర్వేరుగా పేర్కొంటూ ధరలను సూచించాల్సిందిగా ఆ టెండర్ ను జారీ చేసింది. ఈ టెండర్ లో మూడు కంపెనీలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీల డాక్యుమెంట్స్ తో పాటు సాంకేతిక నిర్వహణ సామర్థ్యంపై ప్రజంటేషన్స్ ను కమిటీ పరిశీలించింది. ఏ కంపెనీకి కూడా టెండర్ లో పేర్కొన్న అన్ని సేవలను అందించే సామర్థ్యం లేకపోవడంతో.. కమర్షియల్ బిడ్ ను ఓపెన్ చేయకుండానే ఈ ఏడాది ఫిబ్రవరి 29న టెండర్లను రద్దు చేసింది. ఇప్పుడు సంస్థ వాడుతున్న సాధారణ టిమ్ ల కాలపరిమితి పూర్తవుతుండటం, ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సర్వీస్ ప్రొవైడర్ గడువు ముగుస్తుండటం, కేంద్ర నిధులు నిరుపయోగంగా ఉండటంతో ఏఎఫ్‌‌‌‌సీఎస్‌‌‌‌ త్వరగా అమలు చేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 

పలు రాష్ట్రాల్లో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం

గత టెండర్లలో పాల్గొన్న కంపెనీల అనుభవం, పనితీరును హై లెవల్ కమిటీ మరోసారి పరిశీలించింది. సదరు కంపెనీల సాంకేతిక నిర్వహణ సామర్థ్యం, గత అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అవసరమైన సేవలు అందించగలిగే కంపెనీని ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం పనితీరు, అందిస్తున్న సేవలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించింది. అక్కడి ఉన్నతాధికారులను సంప్రదించి.. వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ వ్యవస్థ అమలుకు సాంకేతిక నిర్వహణ సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, మెరుగైన పనితీరు, ఆర్థిక, తదితర అంశాలను ఇతర కంపెనీలతో బేరిజు వేసుకుని చలో మొబిలిటీకి ఈ సేవలను అందించే బాధ్యతను అప్పగించాలని ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదించింది.