యాదగిరిగుట్టపైకి ఆటోలకు అనుమతి

  • గుట్టపైకి ఆటోలకు షరతులతో కూడిన అనుమతి 
  • జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య
  • 2022 మార్చి 28న ఆటోలను నిషేధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం

యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్టలో  రెండేండ్ల అనంతరం గుట్టపైకి ఆటోల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.  2022 మార్చి 28న అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు కొండపైకి ఆటోలను నిషేధించింది. ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా యాదగిరిగుట్టకు వచ్చారు.  ఆ సమయంలో ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు.  స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కూడా గెలిస్తే కొండపైకి ఆటోల రాకపోకలను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన రివ్యూల్లో ఆఫీసర్లు కొండపైకి ఆటోలు నిలిపివేయడంపై గురించి చర్చించారు.  

ఆటోలపై నిషేధం ఉన్నప్పుడు మిగతా ప్రైవేటు వాహనాలను ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.  దీంతో వాహనాల నిషేధం, అనుమతి ఇవ్వడంపై అప్పటి ఆలయ ఈవో గీతా రెడ్డి, వైటీడీసీ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ కిషన్‌‌‌‌ రావు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.  దీంతో కొండపైకి ఆటోలు పునరుద్ధరించాలని ప్రభుత్వ విప్‌‌‌‌ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సుముఖత వ్యక్తమయింది. 

భక్తులకు తొలగనున్న ఇబ్బందులు

పాత ఘాట్​ రోడ్డు సమీపంలో ఉన్న తులసీ కాటేజీ నుంచి భక్తులు బస్టాండ్‌‌‌‌ రావాలంటే రెండు కిలోమీటర్లు నడవాలి.  పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తున్నందున విపరీతమైన రద్దీతో భక్తులు ఇబ్బంది పడేవారు.  ఆటోల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో బస్సుల కోసం ఎదురుచూడకుండా వెళ్లే అవకాశం కలిగింది.  దీంతో భక్తుల ఇబ్బందులు కొంతమేర తొలిగే అవకాశాలున్నాయి. 

20 నెలలు ఆందోళన చేసినా.. స్పందించని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్​

యాదగిరిగుట్ట ప్రధానాలయ పునర్నిర్మాణం తర్వాత..  2022 మార్చి 28న టెంపుల్‌‌‌‌ను రీఓపెన్‌‌‌‌ చేశారు.  రీ ఓపెన్ సందర్భంగా మార్చి 28న ఒక్కరోజు కొండపైకి ఆటోలను బంద్ చేయాలని అప్పటి ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు.  ఒక్కరోజే కదా అని ఆటో డ్రైవర్లు నడపడం ఆపేశారు.  కానీ ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొండపైకి ఆటోలను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.  

దీంతో 2022 మార్చి 28 నుంచి కొండపైకి ఆటోల రాకపోకలు నిలిచిపోయాయి.  అప్పటి నుంచి  కొండపైకి ఆటోలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ..  300 మంది ఆటో డ్రైవర్లు దాదాపుగా 20 నెలల పాటు రిలే దీక్షలు చేశారు. అయినా గత సర్కార్​ స్పందించలేదు.  అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో..  రిలే దీక్షలు నిలిపివేయాలని పోలీసులు చెప్పడంతో..  2023 నవంబర్‌‌‌‌‌‌‌‌లో రిలే దీక్షలు ముగించారు. 

పాత ఘాట్ రోడ్డు నుంచి ఆటోల రాకపోకలు

ఆటోల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య, కలెక్టర్​ హనుమంతు జెండగే  జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు.  పాత ఘాట్​రోడ్డు మీదుగా బుధవారం ఆటోలు రాకపోకలు సాగించాయి.   షిప్టుకు 50 ఆటోల చొప్పున రోజుకు రెండు షిప్టులుగా విభజించి వంద ఆటోలకు అనుమతించారు.  మిగిలిన ఆటోలను గురువారం పంపిస్తారు.  ఒక్కో ఆటోలో డ్రైవర్​సహా ఐదుగురు మాత్రమే ప్రయాణించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నరు.