కొత్త సీపీకి అనేక సవాళ్లు!

  • కొత్త సీపీకి అనేక సవాళ్లు!
  • కమిషనరేట్ లో గాడి తప్పిన అడ్మినిస్ట్రేషన్
  • పెండింగ్ లోనే పెద్ద పెద్ద కేసులు
  • నానాటికీ పెరుగుతున్న దందాలు
  • నగరంలో రౌడీ గ్యాంగులతో బెంబేలు


హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో నానాటికీ దందాలు, చోరీలు పెరిగిపోతున్నాయి.  భూకబ్జాలు, గంజాయి అక్రమ రవాణా, ఫేక్ సర్టిఫికేట్ల బాగోతం, సైబర్ దాడులు, గుడుంబా దందా, రౌడీల అల్లర్లు, సెటిల్ మెంట్లు, చైన్ స్నాచింగ్ లు, దొంగతనాలు రెట్టింపు అవుతున్నాయి. నమోదవుతున్న కేసుల్లో.. చాలావరకు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఓవైపు అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది. సిబ్బంది, స్టేషన్ల కొరత కూడా వేధిస్తోంది. ఈ క్రమంలో కమిషనరేట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్​కు క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. 

మేజర్​ కేసులన్నీ  పెండింగే..

వరంగల్ కేంద్రంగా వెలుగు చూసిన ఫేక్​సర్టిఫికేట్ల బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిత్తించింది. 2021 డిసెంబర్​, 2022 జనవరిలో రెండు గ్యాంగులను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకోగా.. దర్యాప్తును మరిచిపోయారు. ఫేక్​ సర్టిఫికేట్లు పొందిన వారిలో ఓ ప్రజాప్రతినిధి కొడుకు, ఓ పెద్దాఫీసర్​ కొడుకు ఉండడంతో అప్పటి పోలీసులు ఈ కేసును నీరుగార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వరంగల్ లో ఓ లిక్కర్​ డాన్​కొడుకు మిల్స్​కాలనీ పీఎస్​ పరిధిలోని ఓ యువతిని మోసం చేయడంతో నిరుడు  పోలీసులు కేసు ఫైల్​ చేశారు. కానీ ఆయనకు డిపార్ట్​మెంట్ ఆఫీసర్ల సహకారం ఉండడంతో ఆ కేసు కూడా కనుమరుగైంది. నక్కలగుట్టలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఎదుట పట్టపగలే రూ.25లక్షల దోపిడీ జరగగా.. రెండ్రోజుల్లో కేసును ఛేదిస్తామన్న అధికారులు ఏడాదైనా ఎవర్నీ పట్టుకోలేదు. మరోవైపు వరంగల్ కేంద్రంగా గంజాయి, గుట్కా, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం పెరిగిపోయింది. గ్రామాలకూ గంజాయి పాకింది. రేషన్ బియ్యం దందా కూడా జోరుగా సాగుతోంది. ఏకంగా మిల్లుల్లోనే టన్నుల కొద్దీ రేషన్ బియ్యం పట్టుబడుతోంది.

ల్యాండ్ గ్రాబర్స్​.. రౌడీ గ్యాంగులు

వరంగల్ సిటీ చుట్టుపక్కల భూముల రేట్లు  ఆకాశాన్నంటాయి. దీంతో కొన్ని గ్యాంగులు భూకబ్జాలకు తెరలేపాయి. ఖాళీ జాగలకు నకిలీ కాగితాలు సృష్టించడం, ఫేక్​ జీపీఏలతో క్రయవిక్రయాలు జరపడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి దుండగు లను కట్టడి చేసేందుకు గతంలో కమిషనరేట్​లో సెపరేట్​గా ఒక సెల్​ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆఫీసర్లు మారుతుండటంతో  దానిని లైట్​తీసుకున్నారు. నయీం గ్యాంగ్​అనుచరులు సైతం సెటిల్ మెంట్లు మొదలుపెడుతున్నారు. ఇటీవల ఇద్దరు ముగ్గురు పట్టుబడగా.. ఈ కేసులోకి లీడర్లు ఎంటరై నీరుగార్చారనే ఆరోపణలున్నాయి. మిల్స్ కాలనీ, మట్వాడా, ఇంతేజార్​గంజ్, సుబేదారి, కేయూ పీఎస్​ ల పరిధిలో ఇటీవల తరచూ గ్యాంగ్​ వార్​లు జరుగుతుండడంతో జనాలు భయపడుతున్నారు.

వేధిస్తున్న స్టేషన్ల కొరత..

వరంగల్ కమిషనరేట్ లో 53 పోలీస్ స్టేషన్లు ఉండగా.. నానాటికీ క్రైమ్ రేట్ పెరుగుతుండడం, ఇక్కడి అవసరాల దృష్ట్యా కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ఆఫీసర్లు గతంలో ప్రపోజల్స్ పంపారు. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. హనుమకొండ, వరంగల్ కు వేర్వేరుగా ఏసీపీ స్థాయి ఆఫీసర్లు అవసరమని గుర్తించినా.. ఆ దిశగా అడుగులు పడలేదు. కమిషనరేట్​లో రెండే మహిళా స్టేషన్లు ఉండగా..  ఇంకో స్టేషన్​పెంచాలనే ప్రపోజల్​పెట్టినా పట్టించుకోలేదు. ఇక సైబర్​ క్రైమ్స్​కోసం సెపరేట్​గా సైబర్​ స్టేషన్​ ఏర్పాటుకు అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు పంపినా.. ఆ పేపర్లు మూలనపడ్డాయి.

ట్రాఫిక్​ తో ఇబ్బందులు..

నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పార్కింగ్​ప్లేసులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త సీపీగా బాధ్యతలు తీసుకోనున్న  ఏవీ రంగనాథ్ కు హైదరాబాద్​ట్రాఫిక్​ జాయింట్ కమిషనర్​గా పని చేసిన అనుభవం ఉండటంతో ట్రాఫిక్​ సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక కమిషనరేట్ లో ఏటికేడు యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. వాటిని కంట్రోల్​ చేసేందుకు తయారు చేస్తున్న యాక్షన్​ప్లాన్లు కాగితాల్లోనే ఉండిపోతున్నాయి.