టెక్నాలజీ : క్రియేటర్ల కోసం..ఆదాయ మార్గం

టెక్నాలజీ : క్రియేటర్ల కోసం..ఆదాయ మార్గం

యూట్యూబ్​.. కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇక క్రియేటర్లకు బాగా సంపాదించుకోవచ్చట! ఇంతకీ ఈ ఫీచర్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? 
కంటెంట్ క్రియేటర్లకు ఆదాయం పెంచేందుకు ‘షాపింగ్ ప్రోగ్రామ్’ను మొదలుపెట్టింది. దీనిద్వారా అర్హులైన క్రియేటర్లు తమ వీడియోలు, షార్ట్​లతోపాటు లైవ్​ స్ట్రీమ్​లలోనూ ఈ ఫీచర్ వాడొచ్చు. ఆ వీడియోలకు ప్రొడక్ట్​లను ట్యాగ్ చేసి, సంపాదించుకోవచ్చు. అందుకోసం ఇ–కామర్స్ ప్లాట్​ఫామ్స్​ ఫ్లిప్ కార్ట్, మింత్రాతో పార్ట్​నర్​షిప్​ కుదుర్చుకుంది యూట్యూబ్​.

ఇప్పటికే ఈ ఫీచర్ దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో గతంలోనే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారత్​లోనూ లాంచ్ చేసింది. షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్​ని ఎనేబుల్ చేసుకునేందుకు వీడియో క్రియేటర్లు ముందుగా యూట్యూబ్​ షాపింగ్​లో సైనప్​ అవ్వాలి. అప్లికేషన్​ ప్రాసెస్ పూర్తయ్యాక ఈ ఫీచర్​ని యాక్సెస్​ చేయొచ్చు. అప్​లోడ్ చేసే వీడియోలు, షార్ట్​లు, లైవ్​ స్ట్రీమ్​లలో ప్రొడక్ట్​లను ట్యాగ్ చేయొచ్చు. యూజర్లు పక్కనే ఉన్న షాపింగ్ సింబల్​పై క్లిక్ చేస్తే.. ఆ ప్రొడక్ట్​ వివరాలు కనిపిస్తాయి. వేరే బ్రౌజర్ పేజ్​కు వెళ్లాల్సిన పనిలేకుండా అక్కడే ఐటమ్​ డీటెయిల్స్ కనిపిస్తాయి కాబట్టి నచ్చిన వాటిని పిన్​ చేయొచ్చు. 

అయితే ఈ ఫీచర్ వాడాలంటే 10 వేలమంది సబ్​స్క్రయిబర్లు ఉండాలి. మ్యూజిక్ ఛానెల్స్, పిల్లల కోసం ఛానెల్స్ రన్ చేసేవాళ్లకు మాత్రం ఈ ఫీచర్ 
అందుబాటులో ఉండదని యూట్యూబ్​ తెలిపింది. ప్రమోట్ చేసిన ప్రొడక్ట్​లను యూజర్లు కొంటే.. క్రియేటర్లకు కమిషన్ వస్తుంది. ఐటమ్స్ ట్యాగ్ చేసే టైంలో కమిషన్ డిటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఒక వీడియోకు దాదాపు 30 ఐటమ్స్ ట్యాగ్ చేసుకోవచ్చని యూట్యూబ్​ చెప్పింది.