24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నం : కేటీఆర్

24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నం : కేటీఆర్

 

  • చిల్లర రాజకీయాలు మానాలి
  • నిరుటితో పోలిస్తే వరద సమస్య తగ్గింది: కేటీఆర్​
  • 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నం
  • కడెం ప్రాజెక్టు దగ్గర ఏం జరుగుతున్నదో నాకు తెలియదు
  • హైదరాబాద్​ మునగలేదు.. ఇమేజ్​ దెబ్బతీయొద్దు
  • మున్సిపల్​ ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం పని చేస్తున్న ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసేలా ప్రతిపక్ష పార్టీలు చిల్లర విమర్శలు చేయొద్దని మంత్రి కేటీఆర్​ అన్నారు. ‘‘ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ప్రభుత్వం, ఉద్యోగులు, సిబ్బంది భారీ వర్షాలతో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు 24 గంటలూ పని చేస్తున్నరు.  ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసేలా ఏ ఒక్కరూ మాట్లాడటం సరికాదు” అని చెప్పారు. గురువారం మున్సిపల్​అధికారులు, అడిషనల్​ కలెక్టర్లతో కేటీఆర్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 

అనంతరం హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. హుస్సేన్​సాగర్​వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్​చేస్తున్నామని, ఎక్కడికక్కడ కంట్రోల్​రూములు ఏర్పాటు చేశామని, ముంపు ప్రాంతాల ప్రజల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూసీ వరదలను మానిటరింగ్​ చేస్తున్నామని చెప్పారు. వర్షాలు తగ్గగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్​లోని వరద ప్రభావ ప్రాంతాలకు వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించానని, అవసరమైతే శుక్రవారం తానే స్వయంగా వరంగల్​ వెళ్తానని ఆయన చెప్పారు.

వరద సమస్య బాగా తగ్గింది

లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లోని వారిని సహాయ శిబిరాలకు తరలిస్తామని కేటీఆర్​ అన్నారు. ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిథిల భవనాలను గుర్తించి వాటిలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నాలాల విస్తరణ ఇతర చర్యల వల్ల నిరుటితో పోల్చితే ఇప్పుడు వరద సమస్య బాగా తగ్గిందని ఆయన తెలిపారు. ‘‘గతంలో ఇలాంటి వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. హైదరాబాద్​లో తాత్కాలికంగా కొన్ని కాలనీల్లో నీళ్లు వచ్చి ఉంటయ్​. హైదరాబాద్​ మునిగిపోయిందని చెప్పి ఇమేజ్​ దెబ్బతీయకండి. హైదరాబాద్​ ముని గిపోలేదు’’ అని పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు పరిస్థితి గురించి తనకు ప్రత్యక్షంగా అవగాహన లేదని, అక్కడ ఏం జరుగుతున్నదో తెలియదని మంత్రి కేటీఆర్​ అన్నారు.  గ్రేటర్​హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నతాధికారులు మొదలు క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ ఫీల్డ్​లోనే ఉండి పనిచేస్తున్నారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా మున్సిపల్​ఉద్యోగుల సెలవులన్నీ రద్దు చేశామన్నారు. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. 

ALSO READ:కెమికల్స్, పెట్రోకెమికల్స్​ కోసం పీఎల్​ఐ! : నిర్మలా సీతారామన్​

హైదరాబాద్​కు రెడ్​ అలర్ట్​ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నగరంలోని అన్ని నాలాల్లో పూడిక తొలగించామని, వర్షం నీళ్లు సులువుగా వెళ్లేలా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలోనే ఉండి పనిచేస్తున్నారన్నారు. కేటీఆర్​ వెంట ఎంఏయూడీ స్పెషల్​సీఎస్​ అర్వింద్​ కుమార్, జీహెచ్​ఎంసీ కమిషనర్ ​రోనాల్డ్​ రోస్, వాటర్ ​బోర్డు ఎండీ దానా కిషోర్​ తదితరులు ఉన్నారు.