
- హైదరాబాద్‌లో చదరపు అడుగు సగటు ధర రూ. 8,306
- 2023–24 తో పోలిస్తే 5 శాతం పెరుగుదల: ప్రాప్‌ఈక్విటీ
న్యూఢిల్లీ: ముడిసరుకుల ధరలు పెరగడంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో లాంచ్ అయిన కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్‌ల ధరలు 9 శాతం (ఏడాది లెక్కన) పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. ఇండియాలోని టాప్ 9 నగరాల్లో ఇండ్ల సగటు ప్రారంభ ధర 2024-–25లో 9 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 13,197కి చేరిందని, ఇది 2023–24 తో చదరపు అడుగుకు రూ. 12,569గా ఉందని తెలిపింది. కొత్త ప్రాజెక్టులలో ఇండ్ల సగటు ధరలు కోల్‌కతాలో గరిష్టంగా 29 శాతం పెరిగాయి.
ఆ తర్వాత ఠాణేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పూణేలో 10 శాతం, ఢిల్లీ–-ఎన్‌సీఆర్‌లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతం పెరిగాయి. ముంబై, నవీ ముంబైలో ఇండ్ల రేట్లు 3 శాతం చొప్పున తగ్గడం విశేషం. ప్రాప్‌ఈక్విటీ సీఈఓ సమీర్ జసూజా మాట్లాడుతూ, " గత కొన్ని సంవత్సరాలుగా ల్యాండ్, కార్మికులు, నిర్మాణ సామగ్రి వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ఇండ్ల రేట్లూ పెరుగుతున్నాయి" అని అన్నారు.
ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం, బెంగళూరులో కొత్త ప్రాజెక్టులలో ఇండ్ల సగటు ధరలు 2023–-24 లో చదరపు అడుగుకు రూ.8,577 ఉంటే, 2024–25 లో రూ. 9,852కి పెరిగాయి. కోల్‌కతాలో సగటు రేటు చదరపు అడుగుకు రూ. 6,201 నుంచి రూ. 8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చదరపు అడుగుకు రూ. 7,645 నుంచి రూ. 7,989కి, హైదరాబాద్‌లో రూ. 7,890 నుంచి రూ. 8,306కి, పూణేలో రూ. 9,877 నుంచి రూ. 10,832కి పెరిగాయి.
ఠాణేలో సగటు రేట్లు చదరపు అడుగుకు రూ. 11,030 నుంచి రూ. 12,880కి ఎగిశాయి. ఢిల్లీ– ఎన్‌సీఆర్‌లో ఇండ్ల సగటు ధరలు చదరపు అడుగుకు రూ. 13,396 నుంచి రూ. 14,020కి పెరిగాయి. అయితే, నవీ ముంబైలో రేట్లు చదరపు అడుగుకు రూ. 13,286 నుంచి రూ. 12,855కి, ముంబైలో చదరపు అడుగుకు రూ. 35,215 నుంచి రూ. 34,026కి తగ్గాయి.