- ఐదేండ్లలో లక్షా 8 వేల మంది.. రైతు బీమా లెక్కల్లో వెల్లడి
- ఈసారి 46 లక్షల మందికి బీమా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సగటున రోజుకు 50 మందికి పైగా రైతులు మరణిస్తున్నారు. రైతు బీమా లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది. గత బీమా ఇయర్ (2022 ఆగస్టు 15 నుంచి 2023 ఆగస్టు 14) లో 19,202 మంది రైతులు చనిపోయినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలు చేస్తున్నది. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు అందిస్తున్నది. సహజ మరణం, ఆత్మహత్యలు, ఇతర ఏ కారణాలతో చనిపోయినా బీమా అమలవుతుంది.
రైతు బీమా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదేండ్లలో లక్షా 8 వేల మంది రైతులు చనిపోయారు. 2022–23 బీమా ఇయర్ లో 36.78 లక్షల మందికి ఇన్సూరెన్స్ చేయగా 19,202 మంది రైతులు మరణించారు. 2021–22లో 40.07 లక్షల మందికి బీమా చేయగా 23,093 మంది.. 2020–21లో 32.73 లక్షల మందికి ఇన్సూరెన్స్ చేయగా 29,070 మంది.. 2019–20లో 32.16 లక్షల మందికి బీమా చేయగా 19,020 మంది.. 2018-–19లో 31.27 లక్షల మందికి ఇన్సూరెన్స్ చేయగా 17,666 మంది రైతులు చనిపోయారు.
ఈసారి (2023–24) రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 5వరకు అవకాశం ఇవ్వగా, మొత్తం 45.87 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.40 లక్షల మంది పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉన్నారు. వీరిలో 18 నుంచి 60 ఏండ్ల లోపు వయసుండి, రైతు బీమాకు అర్హులైన రైతులు 53.08 లక్షల మంది ఉన్నారు. అంటే అర్హులైన 7.21 లక్షల మంది రైతులు బీమా నమోదు చేసుకోకపోవడం గమనార్హం. ఈసారి కొత్తగా 9 లక్షల మంది రైతులు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినోళ్లు 4.70 లక్షల మంది ఉండగా, మిగతా వాళ్లు ఆర్ఓఎఫ్ఆర్ లబ్ధిదారులు ఉన్నారు.నిరుడు అప్లై చేసుకున్న 36.78 లక్షల మంది రైతుల బీమాను రెన్యూవల్ చేయగా, ఈసారి కొత్తగా 9.09 లక్షల మందికి బీమా కల్పించామని పేర్కొన్నారు.